తెలంగాణ: దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్.ఐ. డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరాలను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా దళిత యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపణలపై ఎస్పీ రంగనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్.ఐ., కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఎస్పీ రంగనాధ్ దృష్టికి రావడంతో రెండు రోజుల క్రితం ఘటనపై సమగ్ర విచారణ కోసం డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించారు.
విచారణ అధికారి సతీష్ చోడగిరి బాధితునితో పాటు చికిత్స చేసిన వైద్యులు, మరికొంత మందిని విచారించిన ఆనంతరం ఎస్.ఐ. తప్పిదం ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో ఎస్.ఐ., కానిస్టేబుల్ లను ఇద్దరిని సస్పెన్షన్ కు సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ రంగనాధ్ సిఫార్సు మేరకు హైదరాబాద్ రేంజ్ డిఐజి వి.బి. కమలహాసన్ రెడ్డి వీరిద్దని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.