పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమిని సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో టీమ్ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ షమిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మత విద్వేషాన్ని ఎదుర్కొంటున్న షమికి కోహ్లీ అండగా నిలవడమే అందుకు కారణం.
అంతటితో ఆగకుండా కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను కూడా ఇందులోకి లాగుతున్నారు. చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ హేయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
భారత జట్టు పేలవ ప్రదర్శనకు గతంలో ఏ సంబంధం లేకుండా అనుష్కను ట్రోల్ చేసేవారు. ఇప్పుడు మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వారిలోని పశుతత్వాన్ని చాటుతోందంటూ పలువురు పలువురు సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి బెదిరింపులను అరికట్టేలా కఠిన చట్టాలు తెచ్చి, అలాంటి దుష్టులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.