తెలంగాణ కుంభమేళా మేడారం(Medaram) మహా జాతర ప్రారంభమైంది. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో దారులన్ని మేడారం వైపే కదిలాయి. నేటి నుంచి నాలుగు రోజులపాటు సాగే ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర ప్రారంభానికి వారం పది రోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
మేడారం(Medaram) జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. “గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం” అని తెలిపారు. ఇక ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి మేడారం వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు.