Achaleshwar Mahadev | సాధారణంగా శివాలయాల్లో శివలింగాన్ని లేదా శివుని విగ్రహాన్ని పూజిస్తుంటారు. కానీ ఈ ఒక్క ఆలయంలో మాత్రం శివుని వేలిని మాత్రమే పూజిస్తారు. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆలయం పేరు అచలేశ్వర్ మహదేవ్(Achaleshwar Mahadev) ఆలయం. రాజస్థాన్ లోని మౌంట్ అబులో ఉంది. ఈ ఆలయం గురించి శివపురాణం, స్కంద పురాణంలోనూ ప్రస్తావించారు. వశిష్ఠ ముని తపస్సు చేసిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలం నాటి ఆలయం ఇది. ఆలయ ప్రవేశ ప్రాంతంలో రెండు ఏనుగు బొమ్మలు ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా నంది విగ్రహం ఉంటుంది. దీనిని పంచదాతులతో తయారుచేసారట. దీని బరువు 4 టన్నులు.
ఆలయంలో లోపల 108 శివలింగాలు ఉన్నాయి. గర్భగుడిలోని నాగ దేవత విగ్రహం వద్ద ఉన్న చిన్న గుంతలో శివుని వేలు దర్శనమిస్తుంది. అది శివుని బొటనవేలుగా చెబుతారు. చుట్టూ ఉన్న ఆరావళి పర్వతాలు కదలకుండా శివుడు బొటనవేలితో అదిమి పట్టాడని చెబుతుంటారు. చలించే (కదిలే) లక్షణం ఉన్న పర్వతాలను అచలంగా నిలిపాడని ఇక్కడి శివుడిని అచలేశ్వర్ అని పిలుస్తారని పురాణ కథనాలు చెబుతున్నాయి.
అలాగే ఆ చిన్న గుంతలో ఎన్ని నీళ్లు పోసినా కూడా నిండదట. ఇదే ఆలయంలో కాలభైరవుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయ పూజారి వివరణ ప్రకారం.. ఐదు వేల సంవత్సరాల క్రితం.. ఇంద్రుడు బ్రహ్మదేవుడి చేత ఈ గుంత తవ్వించారట. వశిష్ఠ ఆశ్రమంలో నివసించే ఓ ఆవు మాటి మాటికీ ఈ గుంతలో పడిపోతుండేదట. అప్పుడు వశిష్ఠ మహర్షి సరస్వతి దేవి సాయంతో ఆ ఆవుని బయటికి తీయించారు. ఇప్పటికీ ఈ ఆలయంలో ఉండే ఆవు నోటి నుంచి నీళ్లు పడుతూనే ఉంటాయట.