తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నాలుగు మాడ వీధులలో ఊరేగింపు అనంతరం కాలినడకన తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి గారు, ఈవో శ్రీ ధర్మారెడ్డి గారు సారెను తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
పంచమీతీర్థం సందర్బంగా శ్రీవారికి చెందిన రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, శ్రీ సుందరరాజస్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సారెతో పాటు అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటుచేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 12 నుండి 12.10 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.