Karthika masam: ఆలయాలన్నీ కార్తీక మాస శోభ సంతరించుకున్నాయి. ఉదయాన్నే కొలనులు, నదుల్లో భక్తులు స్నానమాచరించి, దీపాలు వెలిగించి మెుక్కులు చెల్లించుకుంటున్నారు. అసలు కార్తీక మాసంలోనే ఎందుకు ఇంత భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు, నిష్టగా ఉపవాసాలు ఎందుకు చేస్తారో, కార్తీక మాసానికి ఎందుకంత ప్రాధాన్యమో తెలుసుకుందాం రండి.
శివ కేశవులకు అత్యంత ప్రీతకరమైన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటారు. ఈ మాసంలో శివుడిని, విష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్మిక. తెలుగు పంచాగంలో కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కార్తీక మాసంలో పవిత్ర స్నానం.. సకల పాప హరణం అని అంటారు. అందువల్లే భక్తులు ఉదయాన్నీ నదీ స్నానాలు చేసి.. శివ కేశవులను ఆరాధిస్తారు. నదిలో పుణ్య స్నానాలు చేసి.. నది ఒడ్డున దీపాలు వెలిగిస్తారు. ఒకవేళ నది సమీపంలో లేకపోతే.. పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో స్నాం చేసినా మంచి ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ఒక గంట ముందు చేసే స్నానాన్నే కార్తీక స్నానం అంటారు. కొందరికి పుణ్యక్షేత్రాలకు వెళ్లటం అసాధ్యం అనుకుంటే.. పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో స్నానమాచరించి.. ఇంటి వద్దే కార్తీక దీపం పెట్టడం కూడా అంతే ఫలితం ఉంటుంది.
కార్తీక మాసం(Karthika masam)లో నదీ స్నానం వలన అంతర పాపాలు నశిస్తాయి. కార్తీక స్నానమనంతరం నుదుటిన తిలకం పెట్టుకోవాలి. ఆపై చెంబుతో నీటిని తీసుకొని, తూర్పుకు అభిముఖంగా నిలబడి భగవంతుని స్మరించుకోవాలి. అనంతరం ఆ నీటిని ఇంటి వద్ద ఉండే తులసికి వేయటం వల్ల ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.