Whatsapp Channel | ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల మనదేశంలో ఛానల్స్ ఫీచర్ ని పరిచయం చేసింది. దీని ద్వారా సంస్థలు, క్రీడా బృందాలు, కళాకారులు, మేధావులు, కామన్ యూజర్స్ తమ ఛానల్ ను ఆరంభించి అప్డేట్స్ అందించొచ్చు. వీటిని యూజర్లు ఫాలో కావొచ్చు. ఎమోజీల ద్వారా ఫీడ్ బ్యాక్ ఇవ్వచ్చు. ఛానల్ ఫాలోయర్ల ఫోన్ నంబరు, ప్రొఫైల్ ఇమేజ్ అడ్మిన్లకు గానీ ఇతర ఫాలోయర్లకు గానీ కనిపించవు. మరి ఛానల్స్ ఫీచర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ ఛానల్స్(Whatsapp Channel) ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్డేట్స్ విభాగంలోకి వెళ్లాలి. ఇందులో ఛానల్స్ పక్కనుండే ప్లస్ గుర్తు మీద నొక్కితే క్రియేట్ ఛానల్స్, ఫైండ్ ఛానల్స్ ఆప్షన్లు కనిపిస్తాయి. క్రియేట్ ఛానల్స్ లో ఛానల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి, కంటిన్యూ బటన్ ను నొక్కాలి. స్క్రీన్ మీద కనిపించే సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలి. ఛానల్ కి పేరు పెట్టుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాక క్రియేట్ ఛానల్ బటన్ మీద క్లిక్ చేస్తే సరి. మీ ఛానల్ క్రియేట్ అయినట్టే.
ఫైండ్ ఛానల్స్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఆల్రెడీ ఉన్న ఛానల్స్ కనిపిస్తాయి. ఛానల్ పేరు తెలిసి ఉంటే సెర్చ్ చేసి, కనుక్కోవచ్చు. ఛానల్ పక్కనుండే ప్లస్ గుర్తును క్లిక్ చేసి ఫాలో కావొచ్చు. లేదంటే ఛానల్ ని ఓపెన్ చేసి అయినా ఫాలో కావొచ్చు. ఒకవేళ అది నచ్చకపోతే.. ఛానల్ పేజీ మీద పైన కుడివైపున ఉండే నిలువు మూడు డాట్స్ ని తాకి, అన్ ఫాలో ఆప్షన్ ఎంచుకోవచ్చు.