వైవాహిక బంధానికి సంబంధించిన ఓ కేసు విషయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI) కీలక వ్యాఖ్యలు చేశారు. భార్యభర్తలిద్దరూ పరస్పర సమ్మతితో విడాకులు తీసుకుంటే ఈ సమస్య ఇంతటితో సమసిపోతుందని, అది వారికే లాభం చేకూరుస్తుందని ఆయన వివరించారు. లేకపోతే వారి కేసు న్యాయవాదులకే ప్రయోజనకరంగా మారుతుందని చెప్పారు. తమ వైవాహకి జీవితానికి సంబంధించిన కేసును బదిలీ చేయాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సదరు మహిళ విద్యార్హతలను సీజేఐ అడిగి తెలుసుకున్నారు. తాను ఎంటెక్ పూర్తి చేసి, అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నట్లు ఆమె తెలిపింది. కాగా ఇంకా తనకు ఎటువంటి ఉద్యోగం లేదని చెప్పింది. దీనిపై సీజేఐ స్పందిస్తూ..
‘‘మీరు విద్యావంతులు. ముందు మంచి ఉద్యోగం సంపాదించండి. ఈ కేసులో మీరు మరో 10 ఏళ్లు అయినా న్యాయపోరాటం చేయొచ్చేమో. కానీ దానివల్ల న్యాయవాదులకే లబ్ధి చేకూరుతుంది. మీరు పరస్పర సమ్మతితో విడాకులు తీసుకోవడానికి ఎందుకు అంగీకరించకూడదు? మీరు తిరిగి వైవాహిక బంధాన్ని కొనసాగించే పరిస్థితుల్లో లేరని స్పష్టం అవుతుంది. మీరు అంగీకరిస్తే కేసును క్లోజ్ చేస్తాం. మీరు నిరక్ష్యరాస్యులైతే కేసు వేరేగా ఉండేదేమో. కానీ మీరు మంచి చదువు చదువుకున్నారు. ఉద్యోగం సంపాదించుకోగలరు’’ అని ఆయన(CJI ) సూచించారు.