LIC launches guaranteed return life insurance plan Jeevan Azad: తమ వినియోగదారులకు దేశీయ అతిపెద్ద బీమా సంస్థ LIC గుడ్ న్యూస్ చెప్పింది. జీవన్ ఆజాద్ పేరుతో కొత్త పొదుపు పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బీమా వ్యక్తిగత పొదుపుతో పాటు జీవిత బీమా తో కూడిన లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు జీవించి ఉంటే గ్యారెంటీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాలసీ పై రుణాలు పొందే అవకాశం కూడా కల్పించింది.
ఎల్ఐసీ జీవన్ ఆజాద్ కనీస హామీ రూ. 2 లక్షల నుంచి గరిష్ఠంగా 5 లక్షల వరకు ఉంది. పాలసీని 15 నుంచి 20 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. పాలసీ కాలవ్యవధిని బట్టి ప్రీమియం ఉంటుంది. పాలసీ కాలవ్యవధి 20 ఏళ్లు అనుకుంటే ప్రీమియం 12 ఏళ్లు చెల్లిస్తే సరిపోతుంది. ఇక, రిస్క్ ప్రారంభమైన తేదీ నుంచి లేదా మెచ్యూరిటీ తేదీకి ముందు పాలసీదారు మరణిస్తే డెత్ బెనిఫిట్ లభిస్తుంది. ఇది వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఉంటుంది. డెత్ బెనిఫిట్ పాలసీదారు మరణించిన తేదీ నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. ఈ ప్లాన్‌ను ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్ లో నేరుగా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఉదాహరణకు పాలసీదారుడు మొదటి సంవత్సరంలో రూ. 25,120, రెండవ సంవత్సరంలో రూ. 24,578 ప్రీమియంను ఇలా 12 సంవత్సరాల పాటు లేదా, పాలసీ టర్మ్ పూర్తి వరకు చెల్లించాలి. దీంతో మొత్తం ప్రీమియం 2,95,478 చెల్లించబడుతుంది. మెచ్యూరిటీ మొత్తం సుమారుగా 5,000,000 ఉంటుంది. అయితే, పాలసీదారుడు 20 ఏళ్లలో కనీసం 12 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది.