బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
అటు ఏపీలోనూ గురువారం రాజమండ్రి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడ్రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. గత నెలలో కుండపోత వర్షాలతో వరదలు ముంచెత్తాయి. కానీ ఈ నెలలో మాత్రం సాగుకు కావలసినంతగా వర్షాలు లేకపోవడంతో ఆరుతడి పంటలు వేసిన రైతులు చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
మరోవైపు ఉత్తరాదిని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే హిమాచల్, ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వానలతో యూపీలో కొండచరియలు విరిగిపడి.. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పంజాబ్‌లో పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. జార్ఖండ్, బీహార్, బెంగాల్, సిక్కిం, అసోం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి వాతావరణ అధికారులు తెలిపారు.