Onion Price | సామాన్యులపై మరో పిడుగు పడనుంది. టమాటా, మిర్చి, అల్లం బాటలోనే ఉల్లి కూడా ఘాటెక్కనుంది. నిత్యావసర కూరగాయల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధిక ధరలకు సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వీటికి తోడుగా కన్నీరు పెట్టించడానికి ఉల్లిపాయ కూడా ధరలు భారీగా పెరుగుతున్న కూరగాయల లైన్ లో చేరనుంది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం వచ్చే నెలలో ఉల్లి రేటు పెరగనుంది. కిలో 70రూపాయలకు చేరొచ్చని తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉల్లి నిల్వలు తగ్గుముఖం పట్టాయని.. ఈ నెల చివరి నాటికి మరింత తగ్గే ఛాన్సుందని.. దీంతో ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని క్రిసిల్ హెచ్చరించింది.
ఉల్లి నిల్వలు తగ్గితే కిలో రూ. 60 నుంచి 70 రూపాయల వరకు పెరిగే అవకాశముందని తెలిపింది. దేశంలో ఉల్లికి ధర(Onion Price) లేకపోవడంతో సాగు విస్తీర్ణం గతంలో కంటే 8 శాతం మేర తగ్గిందని పేర్కొంది. ఖరీఫ్ పంట అక్టోబరు నుంచి మార్కెట్ లోకి వస్తుందని, అప్పుడు ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. దీంతో టమాటా, పచ్చిమిర్చి, అల్లం ధరలతో అల్లాడుతున్న ప్రజలకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు రూ.30 ఉంది. క్రిసిల్ నివేదిక నిజమైతే ఈ నెలాఖరు నాటికి ఉల్లి ధరలు రెట్టింపు కావచ్చు. వచ్చే నెలలో సరఫరా తగ్గితే కిలో రూ. 70 రూపాయల వరకు పెరుగుతుందని వెల్లడించింది.
ఇప్పటికే కిలో టమాటా పలు ప్రాంతాల్లో రూ. 300 పలుకుతోంది. అల్లం కిలో రూ. 250కి పైనే ఉంది. ఇప్పటికే టమాటా, మిర్చి, అల్లం ధరలు ఆకాశన్నంటడంతో అవస్థలు పడుతున్న ప్రజలకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉల్లి ధరలు పెరుగుతాయని క్రిసిల్ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ఆవేదన చెందుతున్నారు సామాన్యులు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఇప్పుడే భారీగా ఉల్లిపాయలు కొని ఇళ్లలో నిల్వ ఉంచుకోండని నిపుణులు సూచిస్తున్నారు.