Drugs Awareness | “డ్రగ్స్” అనే పదాన్ని ఈ మధ్యకాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో చాలా విరివిగా వింటున్నాం., మత్తుతో యువతని చిత్తు చేయడానికి గంజాయి, కొకైన్, మెథాక్వలోన్, ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫేటమిన్స్ వంటి ఎన్నో రకాల కొత్త కొత్త మత్తు పదార్థాలు మార్కెట్ లో రోజు రోజుకి పుట్టుకొస్తున్నాయి.
భోజనం చేశాక కిళ్ళీ వేసుకోవడం ఎంత సహజమో.. పార్టీలో, పబ్బుల్లో డ్రగ్స్ తీసుకోవడం అంతే సహజంగా మారిపోయింది. చదువుకుంటున్న విద్యార్థుల చేతుల్లోకి పుట్టినరోజు చాక్లెట్ల మాదిరిగా అత్యంత సులభంగా డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి..?!
దేశంలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఏదో ఒకచోట డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్మగ్లర్స్ దగ్గర నుంచో లేదా వినియోగిస్తున్న వ్యక్తుల దగ్గర నుంచో ఆకస్మికంగా పోలీసులు దాడి చేసి డ్రగ్స్ పట్టుకుంటున్నారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీసులు నేరస్థుల్ని పక్కా సమాచారంతో పట్టేసుకుంటున్నారు. అయినా కూడా స్మగ్లర్స్ తమ తెలివితేటలకు పదును పెట్టి వినియోగదారుల్ని బాధితులుగా మలుచుకుని అధికారులకు సవాల్ విసిరినట్టుగా సరుకుని కావలసిన చోటికి విజయవంతంగా చేరుస్తున్నారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 ( NDPS చట్టం) ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ తో అరెస్ట్ చేసి.. నేరం నిరూపితమైన పక్షంలో పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష మరియు జరిమానా సైతం విధించే కఠినమైన చట్టాలున్నాయి.
అయినా నేర స్వభావం గల వ్యక్తులు శిక్షార్హమైన నేరం అని తెలిసినా కూడా స్మగ్లింగ్ లోకి ప్రవేశించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తయారీ స్థలం నుంచి వినియోగ కేంద్రాల వరకు చేరే క్రమంలో కొన్నిచోట్ల పట్టుబడినా.. తప్పించుకొని బాధితుల చేతుల్లోకి చేరే సరుకు మొత్తాన్ని ఎంతని అంచనా వేయగలం..?! దాని ప్రభావం సమాజం మీద ఎంతలా ఉంటుందో ఎలా చెప్పగలం..?!
అధికార యంత్రాంగం ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా కూడా కంటైనర్ల కొద్దిగా రవాణా అవుతుంది. వైజాగ్ పోర్ట్ ఏరియాలో గడిచిన ఐదు సంవత్సరాలలో రెండుసార్లు కొన్ని కంటైనర్లలో 25 వేల కిలోలకు పైగా డ్రగ్స్ లభించాయి. అందులో నేరస్తులకు ఎలాంటి శిక్షలు పడ్డాయో ఎవరికీ తెలియదు. డబ్బు సంపాదనే పరమావధిగా పనిచేసే వ్యక్తులు, వ్యవస్థలు సంపాదన మార్గమే అన్వేషిస్తాయి. అందులోని మంచి చెడ్డలు వారికి ఏమాత్రం పట్టదు., డబ్బు సంపాదిస్తే చాలు డ్రగ్స్ మహమ్మారికి ఎవరి జీవితాలు ఎలా నాశనమవుతాయో అనే ఆలోచన కూడా సరఫరాదారులకు తట్టదు.
నేరస్తులు ఒకసారి కాకపోయినా మరోసారైనా పట్టుబడతారు.. పట్టుకోవడం ప్రభుత్వం విధి. ఇది సైకిల్ చైన్ లోని గొలుసుల మాదిరిగా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఆ గొలుసుని ఎలా తెoచాలి..? ఎవరు తెంచాలి..? అవసరం ఎవరికి ఉంది..? అమ్మే వ్యక్తులు సంపదను పోగు చేసుకుంటారు, పోలీసులు విధి నిర్వహణలో ఉద్రిక్తులై ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు.
కానీ డ్రగ్స్ వినియోగిస్తున్న యువత పరిస్థితి ఏమిటి..?! మత్తుకు బానిసైన యువత తమ ప్రాణాలను చిత్తు చేసుకుంటున్నారు. విలువైన తమ జీవితాలను తాత్కాలిక ఆనందానికి బలి చేస్తున్నారు. నేర గణంకాల తాజా నివేదికలు సైతం.. క్షణికావేశంలో డ్రగ్స్ మత్తులో అమాయకుల పై దాడి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయేది అమాయకులు మాత్రమే. మత్తు వదిలాక అతనికి శిక్ష పడ్డా కూడా అంతిమంగా నష్టపోయింది అమాయకులే కదా..! డ్రగ్స్ వినియోగం అనేది క్యాన్సర్, ఎయిడ్స్ కంటే భయంకరమైన వ్యాధి.
అది ఒక మనిషిని పూర్తిగా కబళిస్తుంది., తద్వారా మతిస్థిమితం కోల్పోవడం, అసంకల్పిత వణుకు, కండరాలు పట్టేయడం మరియు దంతాలు బిగించడం, దృష్టి, ధ్వని మరియు రుచి యొక్క గుర్తింపు కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరగడం లేదా తగ్గడం, వాస్తవికత యొక్క అవగాహన బాగా తగ్గటం, హఠాత్తు ప్రవర్తన, భావోద్వేగాలలో వేగవంతమైన మార్పులు, శాశ్వత మానసిక మార్పులు వంటివి సంబంధించి చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఒక మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతిలో అన్ని రకాలైన మార్గాలు, అవకాశాలు ఉన్నాయి., అయినా కూడా డ్రగ్స్ వంటి విషతుల్యమైన పదార్థాలలో ఆనందాన్ని వెతుక్కోవడం అవివేకం. డ్రగ్స్ ను అరికట్టడంలో అధికారుల, ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎలా ఉన్నా.. అవి నిలువునా నాశనం చేసేది వినియోగిస్తున్న వ్యక్తుల్ని. విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలే.
Drugs Awareness | సహజంగా అనుభవించాల్సిన ఆనందాన్ని.. డ్రగ్స్ వంటి మహమ్మారిలో వెతుక్కోవడం అనాగరికం. దీనికి వ్యవస్థని నిందించడం కంటే మనకు మనం అప్రమత్తంగా ఉండటం అందరికీ శ్రేయస్కరం.
బి. సుదర్శన్.
BSc, LLB.