ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

-

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.. మన దేశంలో ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి.. అదుపుతప్పితే పరిస్థితులను చక్కదిద్దటానికి పటిష్టమైన చట్టాలు ఉన్నాయి.

- Advertisement -

అసలు Indian Telegraph Act ఏం చెబుతోంది..?!

ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885లోని సెక్షన్ 5(2) ప్రకారము ఫోన్లను ట్యాప్ చేసే హక్కు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది., దేశభద్రతకు, పరిపాలన వ్యవస్థకు భంగం కలిగించే అనుమానాస్పద వ్యక్తులు యొక్క ఫోన్ సంభాషణలను సంబంధిత అధికారులు ట్యాప్ చేసేముందు హోం మంత్రిత్వ శాఖ నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి. ఆ అభ్యర్థన సహేతుకమైనది అని భావిస్తే సదరు మంత్రిత్వ శాఖ అనుమతి ఇస్తుంది. అలా అనుమతి లేని పక్షాన టాపింగ్ కి పాల్పడిన ఏ వ్యక్తులైన, వ్యవస్థలైన శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లే.

ఇక తాజాగా తెలంగాణలో టెలిఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు డిసెంబర్ 4వ తేదీ అనగా శాసనసభ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు తాను ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న ఆఫీసు కార్యాలయంలోని 42 హార్డ్ డిస్క్ లను ఎలక్ట్రిక్ కటర్ తో ముక్కలుగా నాశనంచేసి వాటిని నాగోల్ మూసి నది బ్రిడ్జి కింద పారేసి వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్ లు ఏర్పాటు చేయడంతో అనుమానం వచ్చిన ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన నేరానికి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనే టెలిఫోన్ టాపింగ్ విషయం బయటకు రావడానికి నాంది పలికింది. అదుపులోకి తీసుకోవాలన్న పోలీసుల నుంచి ప్రణీత్ రావు తప్పించుకోవాలని చూసి నాటకీయంగా సిరిసిల్లలో అరెస్టు అయ్యాడు. ఇక అప్పటినుంచి విచారణలో ఒక్కో అధికారుల పేర్లు బయటపడ్డాయి. తిరుపతన్న, భుజంగరావు, ప్రభాకరరావు, రాధాకిషన్ రావు, వేణుగోపాలరావు, గట్టు మల్లు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వీరంతా ట్యాపింగ్ చేయడంలో ప్రధాన పాత్రధారులు.

అయితే ఈ అధికారులంతా ఏం ఆశించి టాపింగ్ కి పాల్పడ్డారు..?!

ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో వినిపిస్తున్న ప్రధానమైన ఊహాగానాలు ఏమిటంటే.. అప్పటి అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా విపక్ష నేతల ఫోన్లు టాప్ చేసి.. వారి కదలికలను గమనిస్తూ.. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టి.. వాటిని పట్టుకోవడమే ఏకైక ధ్యేయంగా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం సాగిందనేది దర్యాప్తులో వెల్లడైన విషయాలు. ఇది అధికార పార్టీ కోసం తమ అధికారాలను అతిక్రమించి, ఈ అధికారులు చేసిన తప్పుడు వ్యవహారం.

ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారానికి ముందుగా ఇజ్రాయిల్ దేశం నుంచి అత్యాధునిక ట్యాపింగ్ సిస్టం కొనుగోలు చేసి హైదరాబాద్ లోని ఆఫీసులో తనకు గాను సొంత ఆఫీసు రూమ్ సెట్ చేసుకున్న ప్రణీత్ రావు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో టాపింగ్ కోసం వార్ రూములను ఏర్పాటు చేసి అక్కడ తాను ఆదేశించిన వ్యక్తులపై టాపింగ్ చేయడానికి గాను తనకు అనుకూలంగా వ్యవహరించే పోలీసులను నియమించాడు. ఈ చక్రంలో హోంగార్డు నుంచి ఎస్ఐ, సీఐ రేంజ్ వరకు ఉన్నారని తెలుస్తోంది. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ ట్యాప్ వ్యవహారంలో పని చేసే చాలామంది హోంగార్డు, కానిస్టేబుల్స్ కు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకపోవడం కొసమెరుపు.

ఇందులో టాపింగ్(Phone Tapping) బాస్ అయినా ప్రణీత్ రావ్(Praneeth Rao) స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా చేసుకున్నాడు. తాను టార్గెట్ గా చేసుకున్న బడాబడా పారిశ్రామికవేత్తలను, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లు, హవాలా ముఠాల యొక్క ఫోన్స్ టాప్ చేసి డబ్బులు ఇమ్మని బెదిరించాడు. ఆయనతోపాటు వార్ రూమ్స్ లో పనిచేసే అధికారులు సైతం తమ పరిధిలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఆ క్రమంలో మహిళలని సైతం లైంగికంగా వేధించారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే అధికారం మాటున అక్రమ దందాకు తెర తీశారు. ఎవరి ఆశీస్సులతో చేశారో తెలియదు గానీ.. దందాను దర్జాగా.. వ్యాపారుల బలహీనతలని తమ బలంగా మార్చుకొని సంపాదనని మూడు పువ్వులు ఆరు కాయలుగా మలుచుకున్నారు.

మనిషి సహజ నైజం తప్పులు చేయడం.. మనిషి చేసే తప్పుల్ని ఈ ప్రకృతి కొంత వరకే సహిస్తుంది. మితిమీరితే ఎంతటి వ్యక్తులైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మొత్తం ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారంలో రాజకీయ నాయకుల పాత్రను పూర్తిగా పక్కన పెట్టి చూస్తే.. మిగిలిన అధికారులంతా ఉన్నత స్థాయి ఉద్యోగులే. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగం రావాలంటే లక్షల మంది పోటీపడే పరీక్షలో ఒక్కడిగా గెలవాలి. వందల సంఖ్యలో ఉన్న పోస్టులకు లక్షల మంది పోటీపడే పరీక్షలో మేటిగా నిలబడితేనే గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం దక్కుతుంది. అటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధించిన ఈ అధికారులకు 60 ఏళ్ల సర్వీసు ఉంటుంది. నీతిగా నిజాయితీగా నికార్సుగా పనిచేస్తే ప్రమోషన్లు, పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా వస్తాయి. దానికి రాజ్యాంగం ప్రకారం సర్వీసు రూల్స్ ఉన్నాయి. అయినా కూడా ఐదేళ్లకోసారి మారే ప్రభుత్వ ప్రాపకానికి ఈ అధికారులు ఎందుకు వెంపర్లాడుతున్నారనేది అర్థం కాని ప్రశ్న.

ఎవరి లబ్ధి కోసమో టాపింగ్ కు పాల్పడ్డ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తప్పులు చేసి తమతో సమానమైన ఇతర అధికారుల ముందు దోషులుగా నిలబడి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సంజాయిషీలు ఇచ్చుకోవలసిన దుస్థితి తెచ్చుకోవడం ఎందుకు..?! కర్మానుసారమే ఫలితాలు ఉంటాయని పురాణాల కాలం నుంచి ఈ కలికాలం వరకు ఎన్నో ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి కదా..!

రాజకీయ నాయకుల మేలు కోసం ప్రభుత్వ అధికారులు చేసే చట్ట విరుద్ధమైన పనుల వల్ల పూర్తిస్థాయిలో లబ్ధి పొందేది కేవలం రాజకీయ నాయకులు మాత్రమే.. ప్రజల మెప్పు పొందడానికి ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీపై విమర్శలు చేస్తూ ఉంటాయి. ఆ విమర్శ చేసే సందర్భం ఎంత బలంగా ఉంటే అది తమ పార్టీకి అంత ఉపయోగంగా ఉంటుందని అందరి ప్రగాఢ నమ్మకం., అలా ప్రత్యర్థి పార్టీని వేలెత్తి విమర్శించే సందర్భంలో వారి తప్పులను ఎత్తి చూపే క్రమంలో ముందుగా ఇరుక్కుపోయేది ప్రభుత్వ అధికారులు.. చాలా తేలిగ్గా తప్పించుకుపోయేది రాజకీయ నాయకులు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు అత్యంత సహజంగా మారిన ప్రస్తుత తరుణంలో ఒక పార్టీ మరొక పార్టీపై దుమ్మెత్తి పోయడం, ఒకరినొకరు విమర్శించుకునే విషయాలపై ప్రజలు పెద్దగా స్పందించడం లేదు కానీ చట్టాల అతిక్రమణ, అధికార దుర్వినియోగం చేయడం వల్ల ఉద్యోగ వ్యవస్థలో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన అధికారులు కోర్టుల చుట్టూ, ఎంక్వైరీ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ, జైలు జీవితం గడుపుతూ తమ విలువైన జీవితాన్ని స్వలాభం చూసుకునే స్వార్థపూరిత రాజకీయ నాయకుల కొరకు బలి చేసుకుంటున్నారు.

ఈ వికృత క్రీడలో ఎందరో ఉన్నత ఉద్యోగులు బలిపశువులైనారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలుగు రాష్ట్రాలలో ఎందరో ఉద్యోగులు ప్రత్యక్ష ఉదాహరణలుగా ఉన్నారు. తమ ముందు బాధితులుగా నిలబడ్డ తోటి ఉద్యోగుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని చట్టం పరిధిలో ఎందుకు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు..?! ఉద్యోగంలోకి చేరే ముందు చేస్తున్న ప్రమాణాలు ఎందుకు గట్టున పెడుతున్నారు?!

ఒక ఉద్యోగి పైకి ఎదగడానికి ఖచ్చితమయినా సర్వీసు నిబంధనల ప్రకారం గ్యారెంటీ కార్డు ఉంటుంది. కానీ, ఏ గ్యారెంటీ కార్డు లేని రాజకీయ నాయకుల ప్రాపకానికి తలొగ్గి పనిచేస్తున్నారు. దేశంలో ఎన్నో వ్యవస్థలకు స్వతంత్రంగా పనిచేసే హక్కుల్ని రాజ్యాంగం ప్రసాదించింది. అటువంటి వ్యవస్థలన్నీ అధికారంలో ఉన్న పార్టీల కబంధహస్తాలలోకి జారిపోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ప్రజాస్వామ్యం పచ్చగా పరిఢవిల్లాలంటే.. దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ నాయకుల విచక్షణతో పాటు.. ప్రభుత్వ అధికారుల బాధ్యతాయుతమైన, క్రమశిక్షణాయుత, నీతి నిజాయితీలతో కూడిన పరిపాలన ఎంతో అవసరం. ఐదేళ్లకోసారి అధికార బదిలీ జరిగే నాయకులను పక్కన పెడితే చట్టానికి విధేయులుగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఎవరికి విధేయులుగా ఉంటున్నారు..?!

ముంచుకొస్తున్న ప్రమాదానికి ఎదురెళ్లితే ముందుగా నష్టపోయేది మనమే అని తెలిసి కూడా అధికారులు ఎందుకు తప్పులు చేస్తున్నారు..?! ఒకరికి జరిగిన ప్రమాదం ద్వారా జీవితపు గుణపాఠం నేర్చుకోవాలి కదా..! అయినా నేర్చుకోకుండా అడిగే వారు లేరని ఆగడాలు శృతి మించితే ఏదో ఒక రోజు బోనులో నిలబడాల్సిందే., జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే., ఇప్పుడు జరిగిన ఫోన్ టాపింగ్ తో సహా.. ఇంతకుముందు జరిగిన ఎన్నో ఉదంతాలను ఉదాహరణలుగా తీసుకొని ఇక ముందు ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త పడతారని ఆశిద్దాం., రాజ్యాంగ అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తూ దేశ అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములవుతారని ఆకాంక్షిద్దాం.

Sudharshan Advocate

బి సుదర్శన్. 

Bsc, LLB

9177334068

Read Also: నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...