తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.