పత్తికి ఆల్ టైం రికార్డ్..ధర ఎంతంటే?

0
91

మార్కెట్ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా తెల్లబంగారం రికార్డు ధర పలికింది. ఈ సీజన్‌లో పత్తి దిగుబడులు తగ్గడంతో అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పత్తికి అనూహ్యంగా ధరలు పెరుగుతున్నాయి. మద్దతు ధర కన్నా ఎక్కువ ఇచ్చేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు.

మద్దతు ధరను మించి ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో పత్తికి డిమాండ్ పెరగడంతో క్వింటాల్ పత్తి ధర రూ. 10 వేలకు చేరింది. పత్తికి మద్దుత ధర రూ. 5726 కన్నా ఎక్కువ పలుకుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది పత్తి దిగుబడి తక్కువగా ఉండటంలోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రతి పత్తి మార్కెట్ లో ధర సగటున 9 వేల రూపాయల కన్నా అధికంగానే ఉంది. దీంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి.

తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్ లో పత్తికి ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ. 10,510 ధర పలికింది. ఇప్పటికే ఇదే రికార్డ్ ధర అని అధికారులు చెబుతున్నారు. వరంగల్ మార్కెట్ లో గతంలో క్వింటాల్ పత్తి రూ. 10,235 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్ లో పత్తికి డిమాండ్ పెరగడం వల్లే ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.