అవస్థలు పెట్టే అలర్జీ..అంతు చూడండిలా

0
78

ఉదయం లేచింది మొదలు ఉద్యోగాల్లో నిమగ్నమైపోతుంటాం. నిత్యం ఏసీల్లో పనిచేస్తుంటాం. కాస్త ఎండ, ఉబ్బరం ఎక్కువగా ఉంటే ఏసీని మరింత పెంచాల్సి వస్తుంది. ఇది కొందరిలో అలర్జీకి కారణమౌతుంది. మరి అలాంటివారు నిత్యం మందులు వాడాల్సిందేనని అనుకుంటారు. కానీ డాక్టర్ల సూచనలతో చిన్న చిట్కాలతో సమస్యను తగ్గించవచ్చు.

ఏసీ ఎక్కువయితే కొందరిలో అలర్జీ మొదలవుతుంది. కానీ అది శాశ్వతంగా ఉంటుందని అనుకోలేం. రెండు, మూడు వారాల పాటు మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ అలర్జీ ఎందుకు వస్తుందని మనం తెలుసుకోగలగాలి. ఏసీ వల్ల వస్తుందనుకుంటే కొంచెం తగ్గించాలి.

ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. ఏసీ, దుమ్ము ధూళి తదితర కారణాలుంటాయి. రోగ నిరోధకత తగ్గిపోవటం, ఎక్కువ ఒత్తిడి కూడా ఇందుకు ఓ కారణమే. విటమిన్ ‘డి’ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అలర్జీని తగ్గించవచ్చు.

రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, మందులు, అంటువ్యాధులు వంటి పలు కారణాల చేత ఇవి సంభవిస్తాయి. పెంపుడు జంతువులు, రసాయనాలు, సబ్బులు, నూతన వస్త్రాలు, చర్మ పరిరక్షక క్రీమ్‌లు వంటివి చర్మ అలర్జీలకు ప్రధాన కారకాలు. స్కిన్‌ అలర్జీ అంటే కేవలం చర్మ సంబంధిత అలర్జీ అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే ఈ రకమైన అలర్జీకి ముఖ్య కారణం రోగనిరోధక వ్యవస్థలోని లోపాలే అన్న  విషయం వారికి తెలీదు.

స్కిన్‌ అలర్జీతో బాధపడే వారిలో విపరీతమైన దురద, చర్మంపై దద్దుర్లు, పొడి చర్మం, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో ఈ అలర్జీల కారకాలను పరీక్షల ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే సాధారణ రక్త పరీక్ష (తెల్ల రక్త కణాల పరీక్ష) ద్వారా బాధితుడి లక్షణాలను కొద్దిమేరకు గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. మన చర్మం దేనికి ప్రతిస్పందిస్తుందో జాగ్రత్తగా పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే దీనికి నివారణ.