కోవిడ్ రోగులకు ఆయుర్వేద మందు ఇస్తున్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు బొణిగె ఆనందయ్య. ఆయన గత ఏడాది కోవిడ్ తొలి వేవ్ వచ్చినప్పటి నుంచి సుమారు 80వేల మందికి మందు ఇచ్చారు. ఇందులో కోవిడ్ వచ్చిన వారికి కొందరికి మందు ఇవ్వగా, కోవిడ్ రాకుండా ముందు జాగ్రత్తగా కొందరికి మందు పంపిణీ చేశారు. ఆనందయ్య మందుపై వివాదం రేగడంతో మందు తయారీకి బ్రేక్ పడింది.
అయితే ఆనందయ్య మందుకు ఇటు ప్రభుత్వం, అటు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో మందు తయారీకి తిరిగి సద్ధమయ్యారు ఆనందయ్య. కానీ మందు పంపిణీ కోసం సర్కారు సాయాన్ని ఆశిస్తున్నారాయన. మందును బాధితుల ఇండ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కోసం ఆయన సిఎం జగన్ కు లేఖ రాశారు. ఆయన లేఖకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇవాళ గురువారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి స్పందన వస్తే సరేసరి… లేదంటే తానే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని ఆనందయ్య సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. ఇతర జిల్లాల్లో కోవిడ్ బాధితులకు మందును ఎలా పంపాలనే విషయమై తన బృందంతో చర్చించే పనిలో ఉన్నారు.
అవసరమైతే ట్రస్టు ద్వారా మందు పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం కృష్ణపట్నంలోనే మందు తయారు చేస్తున్నామన్నారు. 50వేల మంది కోవిడ్ పాజిటీవ్ రోగులకు పంపిణీ చేసేందుకు అవసరమైన మందు రెడీ చేసి ఉంచినట్లు వారు వివరించారు.
ఇప్పటికే తమ స్వగ్రామం కృష్ణపట్నంలో ప్రతి ఒకరికి మందు పంపిణీ చేశామని, తమ నియోజకవర్గం సర్వేపల్లిలో కొన్ని గ్రామాల్లో పంపిణీ కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.