జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి దయవలన కరోనా తగ్గుముఖం పడుతోందని అన్నారు. కోవిడ్ నియంత్రణలో అద్భుతంగా పనిచేశారని సిబ్బందిని కొనియాడారు. కలెక్టర్లు సహా చివరిస్ధాయిలో ఉన్న వలంటీర్లు, ఆశావర్కర్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ కృషి చేశారన్నారు. వాక్సినేషన్ నూరుశాతం అయ్యేవరకు జాగ్రత్తలు తప్పవని సూచించారు. నిరంతరం కోవిడ్ టెస్టులు జరగాలన్నారు. అవి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు.
కోవిడ్ నోటిఫై ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు, భోజనం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు పై నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఆరోగ్యశ్రీ రోగులకు కచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందాలని సూచించారు. 104 కాల్‌సెంటర్ ద్వారా కోవిడ్ పరీక్షలు, వైద్యం, ఆస్పత్రుల్లో అడ్మిషన్ చేసుకోవాలని, 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన 3 గంటలలోపు సేవలందాలని కోరారు. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలతో కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని తెలిపారు. అన్ని బోధానాసుపత్రుల్లో చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు అవసరమన్నారు. 2 నెలల కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.
కోవిడ్ నివారణకు వాక్సినేషన్ ఏకైక పరిష్కారం అన్నారు. వాక్సినేషన్‌లో మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందన్నారు. 45 సంవత్సరాల పై బడిన వారిలో 90 శాతం వాక్సినేషన్ పూర్తి చేసిన తర్వాత మిగిలిన కేటగిరీల వారిపై దృష్టి పెట్టాలని వివరించారు. ప్రభుత్వ పరంగా 16 కొత్త బోధనాసుపత్రులు నిర్మిస్తున్నామని, 11 పాత మెడికల్ కళాశాలలను కూడా నాడు–నేడులో భాగంగా ఆధునీకరిస్తున్నామని తెలిపారు. జాతీయ స్ధాయి ప్రమాణాలకు ధీటుగా వీటి అభివృద్ధి చేస్తామన్నారు. 16 చోట్ల మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళిక తయారు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రాలు, మేజర్ కార్పొరేషన్లలో వీటి నిర్మాణం జరుగుతుందన్నారు. మూడేళ్ల కాలంలో రూ.100 కోట్లు ఆస్పత్రి రూపేణా పెట్టుబడి పెట్టాలన్నారు. వీటి ద్వారా అందుబాటులోకి అత్యాధునిక వైద్యం వస్తుందని చెప్పారు.
మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలనిచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు. 6 నుంచి 7 వారాల వ్యవధిలో ఇంటింటికీ వెళ్లి దాదాపు 10 సార్లు ఫీవర్ సర్వేలు నిర్వహించామన్నారు. ఎవరికి జ్వరం లక్షణాలు ఉంటే వారిని గుర్తించి పరీక్షలు చేశామని, తద్వారా సకాలంలో మంచి వైద్యం అందించామన్నారు. నిన్నటికి పాజిటివిటీ రేటు 3.36 ఉందన్నారు. అందరినీ అభినందిస్తున్నానని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 322 ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందుతున్నాయని చెప్పారు. 4592 ఐసీయూ బెడ్స్‌లో 3196 బెడ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 19258 ఆక్సిజన్ బెడ్స్‌కు గానూ, 15309 బెడ్స్ అందుబాటులో ఉన్నాయంటే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు లెక్క అని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీటీవీ నెట్‌వర్క్ తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే వారిని వాచ్ చేస్తున్నామన్న భయం ఉంటుందని ప్రయివేటు ఆసుపత్రుల గురించి చెప్పారు.