ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ప్రతి అనుమానితునికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ర్యాపిడ్ టెస్టులు బంద్ పెట్టాలని సిఎం ఆదేశించారు. జగన్ మంగళవారం కోవిడ్ తీరుపై తన క్యాంపు ఆఫీసు నుంచి సమీక్ష జరిపారు. సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు…
రాష్ట్రంలో నిరంతరం కోవిడ్ టెస్టులు జరుగుతుండాలి. అవి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే నిర్వహించాలి. దీనివల్ల కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం కేసులు తగ్గుతున్నాయి. మునపటి అంత ఒత్తడి ఉండదు. కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. దీనికోసం నియమించిన అధికారులు ఇదే పనిలో ఉండాలి. ఆరోగ్యమిత్రలు కూడా ఈ ఆస్పత్రుల్లో ఉండాలి. వీరిద్దరూ ఆయా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సిబ్బంది పనితీరుతో పాటు నాణ్యమైన భోజనం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి. ఈ 4–5 అంశాలకు సంబంధించిన ప్రమాణాల పై కనీసం 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్యశ్రీ రోగులకు కచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం 322 ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందుతున్నాయి. 4592 ఐసీయూ బెడ్స్‌లో 3196 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 19258 ఆక్సిజన్ బెడ్స్‌కు గానూ, 15309 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు లెక్క. ఎక్కడా అలసత్వానికి తావుండకూడదు. ఆ ఆస్పత్రుల్లో సీసీటీవీ నెట్‌వర్క్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వారిని వాచ్ చేస్తున్నామన్న భయం ఉంటుంది.
థర్డ్ వేవ్ వస్తుందో లేదో మనకు తెలియదు. మొదట్లో పిల్లలపై ప్రభావం చూపుతుందని అన్నారు. కాని ఆ పరిస్ధితి ఉండకపోవచ్చని ఇప్పుడు అంటున్నారు. ఏదిఏమైనా మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. అన్ని బోధానాసుపత్రుల్లో చిన్న పిల్లల బెడ్స్ ఉన్నాయా ? లేదా ? చూసుకోవాలి. వారికి ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేయాలి. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్‌అందుబాటులో ఉన్నాయా లేదా తనిఖీ చేయాలి. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది కచ్చితంగా చూడాలి. 10 కేఎల్ ఆక్సిజన్ కెపాసిటీ ప్లాంట్లు పెడుతున్నాం. ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా ? లేదా ? చూసుకోవాలి.
పీడియాట్రిక్ కేర్‌కు సంబంధించి పీడియాట్రీషియన్లను సిద్దం చేసుకోవాలి. జిల్లాల పరిధిలో ఉన్న పీడియాట్రీషియన్ల వివరాలు సేకరించాలి. అవసరమైతే వారి సేవలు వినియోగించుకోవాలి. చిన్న పిల్లల విషయంలో చికిత్స, వైద్యం విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి. వీరికి శిక్షణ ఇచ్చారా లేదా అన్నది ఎప్పటికప్పుడు చూడాలి.
కోవిడ్ నివారణకు వాక్సినేషన్ ఏకైక పరిష్కారం. మనకు కావాల్సినన్ని వాక్సిన్‌లు ఇవ్వరు, వాళ్లు కేటాయించినవే మనం వాడుకోవాలి. వాక్సినేషన్‌లో ఇంకా చాలా దూరం మనం వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో 1,28,84,201 మందికి ఇప్పటివరకు వాక్సినేషన్ పూర్తయింది. వీరిలో 32,58,885 మందికి డబుల్ డోస్ వాక్సినేషన్ పూర్తి కాగా, 96,25,316 మందికి ఒక డోసు వాక్సినేషన్ పూర్తయింది. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కనీసం 90 శాతం వాక్సినేషన్ పూర్తయితే, తర్వాత… మిగిలిన కేటగిరీల వారిపై దృష్టి పెట్టండి.