Health Tips- బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

Are you making these mistakes in the case of breakfast?

0
83

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఆవశ్యకమనే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే మనం నిద్రపోయే సమయంలో అంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఏ ఆహారాన్నీ తీసుకోం. దీనివల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. దీన్ని తిరిగి తెచ్చుకోవడానికి అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ సమయంలో మనం తీసుకొనే ఆహారంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా బరువు పెరుగుతామని చెబుతున్నారు నిపుణులు. మరి అల్పాహారం తీసుకొనే సమయంలో మనం చేస్తున్న ఆ పొరపాట్లేమిటో..వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం మరి.

ఉదయాన్నే అల్పాహారంలో చాలామంది పాలతో పాటుగా, ఓట్స్‌ను కలిపి తీసుకొంటారు. ఇది తినేటప్పుడు రుచిగా అనిపించడం కోసం కాస్త ఎక్కువగానే పంచదార వేసుకొంటూ ఉంటారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే పంచదార ఎంత ఎక్కువగా తింటే మనం తీసుకొన్న ఆహారం అంత త్వరగా జీర్ణమైపోతుంది. దీనివల్ల తక్కువ సమయంలోనే తిరిగి ఆకలి వేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా మళ్లీ ఏమైనా తినాలనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో అధికమొత్తంలో కొవ్వు పేరుకొనే అవకాశం ఉంటుంది.

కొంతమందికి బారెడు పొద్దెక్కితేనే గానీ తినే అలవాటు ఉండదు. పైగా దాన్ని ఓ గొప్ప విషయంగా భావిస్తుంటారు. మనం ఎంత ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని భావిస్తే ఆకలి అంత ఎక్కువగా వేస్తుంది. దీంతో మనం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఆహారమే తినేస్తాం.

ఇది కూడా మనం బరువు పెరిగేలా చేస్తుంది. అందుకే రోజూ నిద్ర లేవగానే కాసేపు వాకింగ్ చేయాలి. నడక పూర్తవగానే తినడం కాకుండా..కాసేపు ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.