మేక‌ప్‌తో నిద్ర‌పోతున్నారా..అనారోగ్యం కొనితెచ్చుకున్న‌ట్టే!

Are you sleeping with make-up .. if you get sick ..!

0
73

ఏదైనా శుభ‌కార్యానికి వెళ్లాలంటే మ‌గ‌వాళ్ల‌కు ష‌ర్ట్, ప్యాంట్ వేసుకుంటే స‌రిపోతుంది. కానీ ఆడ‌వాళ్ల అలంక‌ర‌ణ అంత ఈజీగా పూర్తికాదు. వాళ్లు డ్రెస్సింగ్‌తోపాటు కేశాలంక‌ర‌ణ చేసుకోవాలి. ముఖానికి ఫౌడ‌ర్లు వేయాలి. క‌ళ్ల‌కు ఐ లైన‌ర్ రాయాలి. పెదాల‌కు లిప్‌స్టిక్ పెట్టాలి. అందుకు ఎంత స‌మ‌యం ప‌ట్టినా స‌రే ఓపిగ్గా మేక‌ప్ అవుతారు ఆడ‌వాళ్లు. కానీ ఫంక్ష‌న్ నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత వాటిని తీసేయ‌డంలో మాత్రం చాలామంది బ‌ద్ద‌కిస్తారు. మేక‌ప్ అలాగే ఉంచుకుని నిద్ర‌పోతారు. కానీ దీనివ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇంత‌కు ఆ స‌మ‌స్య‌లు ఏమిటో మ‌నం తెలుసుకుందాం.

క‌ళ్లు అందంగా క‌నిపించ‌డం కోసం ఐలైనర్‌, మస్కారా లాంటి వాటిని రాసుకుంటాం. అవి కళ్ల అందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాత్రి ప‌డుకునే ముందు వాటిని తీసేయ‌క‌పోతే కళ్ల నుంచి నీరు కారడం, క‌ళ్లు ఎర్రగా మారడం, కంటి దుర‌ద‌ వంటి సమస్యలు వ‌స్తాయి. అందుకే పడుకునే ముందు ఐ మేకప్‌ను రిమూవర్‌తో తుడిచేయాల‌ని, కళ్లను శుభ్రంగా చన్నీళ్లతో కడిగేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక ముఖంపై ఉన్న మేకప్‌ని తొలగించుకోకుండా ఎక్కువ సేపు ఉంచ‌డంవ‌ల్ల అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మేక‌ప్‌ను వ‌దిలేయ‌డంవ‌ల్ల చ‌ర్మం పొడిబారి పోతుంద‌ని, వ్యర్థాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోతాయని అంటున్నారు. దాంతో వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత రావాల్సిన ముడుత‌లు ముందే వ‌స్తాయంటున్నారు. కాబ‌ట్టి ప‌డుకునే ముందు రిమూవర్‌తో మేక‌ప్‌ను తొలగించుకోవ‌డం ఉత్త‌మం.

అదేవిధంగా పెదాల‌కు పెట్టుకునే లిప్‌స్టిక్‌ను కూడా ప‌డుకునే ముందు తీసివేయ‌క‌పోతే స‌మ‌స్య‌లే అంటున్నారు నిపుణులు. లిప్‌స్టిక్‌ను ఎక్కువ‌సేపు తొల‌గించ‌కుండా వ‌దిలేస్తే అది పెదాలపై ఉండే తేమను పీల్చుకుంటుంద‌ట‌. దాంతో పెదాలు పొడిబారిపోయి ప‌గుళ్లు వ‌స్తాయ‌ట‌. ఈ ప‌గుళ్లు తీవ్రంగా వేధిస్తాయి కాబ‌ట్టి ప‌డుకునే ముందు లిప్‌స్టిక్‌ను తీసేయ‌డ‌మే మేలు. అందుకే మేకప్ ను తొలగించండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి.