క్యారెట్ లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్(Carrot Juice)లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ మనకి రోజువారీ కావాల్సిన దానికంటే ఎక్కువే లభిస్తాయి. క్యారెట్‌లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. అవేంటంటే…
విటమిన్ ఎ
బీటా-కెరోటిన్
విటమిన్ కె
విటమిన్ సి
లుటీన్
థయామిన్
నియాసిన్
విటమిన్ B6
విటమిన్ ఇ
పొటాషియం
మాంగనీస్
కాపర్
ఫాస్పరస్
క్యారెట్లు బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బలమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటంతో కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యారెట్లు కంటి ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయని ఎక్కువగా వింటూ ఉంటాం. అందుకు కారణం వీటిలో ఉండే లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్స్ లెన్స్, రెటీనాను రక్షించడానికి.. బ్లూ లైట్ శోషణను నిరోధించడానికి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. క్యారెట్‌లోని బీటా కెరోటిన్ అతినీలలోహిత కాంతి నుండి కంటి రక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది.
క్యారెట్ తినడం వల్ల హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్యారెట్‌లో విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బులను తగ్గించడంలో సహాయ పడతాయి.
గమనిక: క్యారెట్ జ్యూస్(Carrot Juice)లో ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది. క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల కెరటెనిమియాకి దారితీయవచ్చు. రక్తంలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మం పసుపు రంగులోకి మారే తాత్కాలిక పరిస్థితి ఇది. విటమిన్ ఎ లేదా బీటా కెరోటిన్ ఎక్కువగా తీసుకోకుండా క్యారెట్ జ్యూస్ ప్రయోజనాలను ఆస్వాదించడానికి సగం గ్లాసు కంటే ఎక్కువ తాగకపోవడం మంచిది.