మన వంటగది ఒక ఔషధ శాల అని చెప్పేది ఆయుర్వేదం. ప్రతి మన వంటల్లో వినియోగించే ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తారు. అలాంటిది మనం వండే దాదాపు ప్రతి కూరలో వాడేది కరివేపాకు. ఈ కరివేపాకును ఆయుర్వేదం ఎంతో గొప్పగా చెప్తుంది. ఈ చెట్టుకు ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావని, మనకు ఎన్నో ఆరోగ్య లాభాలను ఈ ఒక్క మొక్క అందిస్తుంది. కరివేపాకును ఏ విధంగా తీసుకున్నా మేలే కానీ కీడు చేయదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందుకేనేమో మన పూర్తికులు భారతీయ వంటకాలలో కరివేపాకు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. కేవలం వంటల్లోనే కాదు పచ్చి ఆకు తిన్నా, పొడి చేసుకుని సేవించినా దీని వల్ల కలిగే లాభాలకు కరువు లేదంటున్నారు. ప్రతి రోజూ కరివేపాకు టీ(Curry Leaves Tea) తాగితే ఆరోగ్యం విషయంలో అద్భుతాలు జరుగుతాయని వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు.
ప్రతి రోజూ కరివేపాకు టీ(Curry Leaves Tea) తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మన ఆహారాన్ని జీర్ణయం చేయడానికి దోహదపడతాయి. దీంతో పాటుగా ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా మన శరీరాన్ని కాపాడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో, రోగనరోధక శక్తిని పెంచడం, శరీరంలో ఉండే ఇంప్యూరిటీస్‌ని తొలగించడంలో కీలకంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా మరెన్నో ప్రమాదకర వ్యాధులకు కూడా కరివేపాకు టీ చెక్ పెడుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం యువతలో అతిపెద్ద సమస్యగా మారిన అధిక బరువుకు కూడా కరివేపాకు టీ అద్భుతంగా పనిచేస్తుందని, ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా మహిళలకు రుతుస్రావం వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి కూడా కరివేపాకు పనిచేస్తుందని, ఇలా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు చెప్తున్నారు.