తేనె(Honey) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే తేనే అతిగా తింటే మాత్రం ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తారు. అలాంటిది చలికాలంలో ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ తేనె తింటే ఏమవుతుంది? మీకెవరికైనా తెలుసా? ఇలా చేస్తే అద్భుతాలు చూస్తామని వైద్య నిపుణులు చెప్తున్నారు. మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. తేనె తీసుకోవడం వల్లే మన జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
చలికాలంలో ప్రతి రోజూ పరగడుపున ఒక స్పూన్ తేనె తినడం చాలా మంచి అలవాటని, ఎన్నో రోగాలు రాకుండా ఇది అడ్డుకుంటుందని చెప్తున్నారు. ప్రథమంగా తేనె తీసుకోవడం వల్ల చలికాలంలో సాధారణంగా వచ్చే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందని, దాంతో పాటుగా సీజనల్‌గా వచ్చే జలుబు వంటి రోగాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెప్తున్న మాట. తేనెలో అధికంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట.
జీర్ణ సమస్యలకు భేష్: ప్రతి రోజూ తేనె(Honey) తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. తేనెలో ఉండే ప్రీబయోటిక్ లక్షణాలు జీర్ణ సమస్యలను నివారించడంతో పాటు పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దగ్గు, జలుబు రాకుండా అడ్డుకుంటుంది. మనం తీసుకునే ఆహారం ఒంటికి పట్టేలా చేస్తుందని వైద్యులు వెల్లడించారు. బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వారికి తేనె దివ్యౌషధంలా పనిచేస్తుందని, దీనిని తీసుకోవడం ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే తేడాను గమనించొచ్చని వైద్యులు వివరిస్తున్నారు.
రోగనిరోధక శక్తి: తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బలంగా మారుస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల అనేక సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరం రక్షించబడుతుంది.
గుండె పదిలం: తేనెలో చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం రసం కలుపుకుని తింటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చట. శీతాకాలం సమయంలో ప్రతిరోజూ పరగడుపున తేనె తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యం కూడా పెరుగుతుందట. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ అధిక కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం.. నిపుణుల సలహా మేరకు మాత్రమే ఆహారంలోకి తేనెను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అలెర్జీ: ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం ద్వారా అనేక అలర్జీలు తగ్గిపోతాయి. వారాల తరబడి పట్టిపీడిస్తున్న జలుబు నుంచి కూడా ఉపశమనం పొందొచ్చని వైద్యులు అంటున్నారు. తేనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. అలర్జీల లక్షణాలను తగ్గిస్తాయి.
ఎసిడిటీ: మన రోజువారీ డైట్‌లో తేనెను కలుపుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మలబద్దక సమస్యకు తేనె అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఈ లాభాలన్నీ కూడా తేనెను ఒక స్పూన్ లెక్కన ఒక ఔషధం తరహాలోనే తీసుకుంటే లభిస్తాయి. మోతాదు మించితే మాత్రం మన ఆరోగ్యంపై తేనె.. ప్రతికూల ప్రభావాలు చూపించే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.