Healthy Hair | పొడవాటి జుట్టు కావాలన్నది ప్రతి అమ్మాయికి ఉండే కల. కొందరికి చిన్నప్పటి నుంచే వత్తైన పొడవాటి జుట్టు ఉంటే మరికొందరు దీని కోసం చేయని ప్రయత్నాలు ఉండవు. అనేక రకాల క్రీమ్‌లు, హెయిర్ ఆయిల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటివి వాడుతుంటారు. కానీ ఫలితం ఉండదు. పైగా కొన్నికొన్ని సందర్భాల్లో జుట్టు పెరగడానికి పైగా.. రాలడం మొదలవుతుంది. అంతేకాకుండా జుట్టు ఉన్నదానికన్నా పల్చబడిపోయి.. చిట్లి పోయి.. అత్యంత దారుణంగా తయారవుతుంది. అయితే జుట్టు బాగా పెరగాలంటే రకరకాల ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు.
అసలు జుట్టు రాలడానికి, అనారోగ్యంగా తయారవడానికి ప్రధాన కారణం దుమ్ము, ధూళి, పోషకాలు లేని ఆహారమేనని చెప్తున్నారు నిపుణులు. వీటిని సరిచేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుతుందనేది వైద్యులు చెప్తున్నమాట. అంతేకాకుండా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పొడవైన జుట్టును పొందొచ్చని నిపుణులు అంటున్నారు. సాధారణంగానే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఉండే రకరకాల కెమికల్స్ మంచి చేయాల్సింది పోగా చెడు చేసే అవకాశాలు ఉన్నాయని, ఏదైన కెమికల్ వికటిస్తే అనేక సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. కొన్ని హోం మేడ్ సీరమ్స్‌ను వాడటం ద్వారా వత్తైన, పొడవాటి జుట్టును పొందొచ్చట. మరి ఆ సీరమ్స్ ఏంటో ఒకసారి చూద్దామా..
కావాల్సిన పదార్ధాలు : కరివేపాకు, బ్లాక్ సీడ్స్, మెంతులు, కలబంద, ఉల్లిపాయ, ఆవనూనె
తయారు చేసుకునే విధానం.. ఒక పాత్ర తీసుకుని అందులో కరివేపాకు, బ్లాక్ సీడ్, కలబంద, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు ఆవ నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి. మంట తక్కువలో పెట్టి అరగంట పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ అఫ్ చేసి నూనెను ఆరనివ్వాలి. ఆ నూనెను గాజు సీసాలోకి వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి.
ఈ హెయిర్ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దనా చేస్తూ పట్టించాలి. ఒక గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెసేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా పెరిగేందుకు ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలన్ని జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు జుట్టుతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె, ఉసిరికాయలు, కరివేపాకు, మెంతులు, అవిసెగింజలు, బ్లాక్ సీడ్స్, మందార పువ్వులు.
తయారు చేసుకునే విధానం: కొబ్బరి నూనెను ఒక పాత్రలో వేసుకుని స్టవ్ పెట్టి వేడి చేయాలి. అందులో ఫ్లాక్ సీడ్స్, ఉసిరి ముక్కలు, మెంతులు, కరివేపాకు, అవిసెగింజలు, బ్లాక్ సీడ్స్, మందార పువ్వులు అన్నీ వేసి బాగా మరిగించాలి. ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నూనెను చల్లార్చాలి. ఈ నూనె నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
Healthy Hair | ఈ నూనెను ప్రతిరోజు జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. దీన్ని గంట ముందు జుట్టుకు పెట్టుకుని ఆ తర్వాత తలస్నానం చేయొచ్చు. కొద్ది రోజుల్లోనే ఈ నూనె మంచి ఫలితాన్నిస్తుంది. ఈ నూనెను తరచుగా వాడితే జుట్టు పొడవుగా, వత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.