కాకరకాయ(Bitter Gourd) అంటేనే చాలా మందికి ఒళ్ళు కంపరమెత్తుతుంది. అందుకు ఇది చేదుగా ఉండటమే ప్రధాన కారణం. ఇంట్లో కూడా కాకరకాయ కూర అంటే ఆ పూట భోజనమే వద్దనే వాళ్ల సంఖ్య అధికంగానే ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాగా కొందరు కాకరకాయ వంటకాలను భలే ఇష్టంగా తింటారు. అయితే దీనిని ప్రతి ఒక్కరూ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కాకరకాయ ఉండటానికి చేదుగా ఉన్నప్పటికీ దీంతో కమ్మని ఆరోగ్యం మన సొంతమవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నిజం చెప్తే దీని చేదు రుచే మన ఆరోగ్యానికి తియ్యని ఫలితాలు ఇస్తుందని అంటున్నారు. ఆనేక ఆరోగ్య సమస్యలను చెక్‌లో ఉంచడమే కాకుండా మరెన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో కూడా కాకరకాయ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. వారంలో రెండు సార్లయినా కాకరకాయను తినడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దామా..
అధిక బరువు: బరువు తగ్గాలనుకునే వారికి కాకరకాయ మంచి ఆప్షన్ అని వైద్యులు అంటున్నారు. ఇందులో పోషకాలు అధికంగా ఉండి, కేలరీలు స్వల్పంగా ఉంటాయి. దీని వల్ల బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్.. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండేలా చేస్తూ బరువు తగ్గడానికి దోహపడుతుంది.
జీర్ణవ్యవస్థ: కాకరకాయలో ఎక్కువగా ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాకరకయల్లోని ఫైబర్ శాతం.. పేగు ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుండె భద్రం: కాకరకాయ తినడం వల్ల మన గుండె పదిలంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో సహాయపడతాయి. వారంలో రెండు మూడు సార్లు కాకరకాయ తినడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించొచ్చని వైద్యులు అంటున్నారు.
డయాబెటిక్స్: షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారికి కాకరకాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది. వీటిలో ఉండే పాలీపెప్టైడ్-పీ అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
విటమిన్లు: కాకరకాయల్లో మన శరీరానికి కాలావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాకరకాయల్లో విటమిన్-సీ అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. అంతేకాకుండా కాకరకాయలు(Bitter Gourd).. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ప్రదాన పాత్ర పోషిస్తాయి.