దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభించిందో చూశాం. ఇక థర్డ్ వేవ్ భయాలు చాలా మందికి ఉన్నాయి. ఇక ఇప్పుడు కోవిడ్-19 డెల్టా వేరియెంట్ జనాల్లో ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ లో కూడా వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇది మరింత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనాను జయించామని ప్రకటించుకున్న ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లో డెల్టా వేరియెంట్ కేసులు వెలుగులోకి రావడంతో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. ఇక కరోనా భయాలు తగ్గాయి అనుకున్న ఆ దేశాల్లో, కొత్తగా ఈ డెల్టా వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
ఆఫ్రికా దేశాల్లో ఈ వేరియెంట్‌తో మూడో వేవ్ ఉధృత దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్‌డౌన్ విధించారు. కేసులు తగ్గాయి అని ఊపిరిపీల్చుకున్న తర్వాత కొత్తగా కేసులు నమోదు అయ్యాయి.సిడ్నీలో కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదయ్యాయి. సిడ్నీ విమానాశ్రయం నుంచి క్వారంటైన్ హోటల్‌కి ప్రయాణికుల్ని తీసుకువెళ్లిన డ్రైవర్‌కి ఈ వైరస్ సోకింది. వారం పాటు ప్రజలు ఎవరూ బయటకు రావద్దు అని సిడ్నీలో లాక్ డౌన్ విధించారు.