భారత్ లో మంకీపాక్స్ కలవరపెడుతుంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించగా..అందులో 3 కేసులు కేరళలోనే కావడం గమనార్హం. దిల్లీలో ఓ కేసు బయటపడగా బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగించే అంశం. అతనికి మంకీపాక్స్ ఎలా సోకిందనేది ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఇక తెలంగాణాలో ఓ వ్యక్తికి వ్యాధి లక్షణాలు ఇప్పుడు టెన్షన్ పెడుతుంది. అయితే తాజాగా మంకీపాక్స్ గురించి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు.
లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదని, పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే సోకే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శంకర్ వెల్లడించారు. బాధిత వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి, పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. రేపు సాయంత్రానికి రిపోర్టు వస్తుందన్నారు.
ఈ నెల 6వ తేదీన బాధితుడు కువైట్ నుంచి వచ్చాడని తెలిపారు. బాధితుడు నీరసం, జ్వరంతో ఉన్నారు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్లారు. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండటంతో ఫీవర్ హాస్పిటల్‌కు వచ్చారని పేర్కొన్నారు. రోగికి దగ్గరగా ఉన్న ఆరుగురిని ఐసోలేషన్‌లో ఉంచామని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలన్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయని డాక్టర్ శంకర్ తెలిపారు.