ప్రస్తుత కాలంలో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. తినే ఆహారం సరిగా లేకపోవడంతో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి తోడు శరీరానికి శ్రమ కలిగించకపోవడం వల్ల కొవ్వు పేరుకుపోయి ఊబకాయులుగా మారుతున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని అనుమానం వస్తుంది. అలాంటప్పుడు మన చేతి గోళ్లను చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొందరి గోళ్ల మీద తెల్ల గీతలు ఉంటాయి. కొందరి గోళ్లు వేరే రంగులో ఉంటాయి. అయితే సాధారణంగా అందరి చేతి గోళ్ల మీద అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది. దీనిని లునులా అంటారు. ఈ లునులా భాగం మన శరీరంలోని అతి సున్నితమైన భాగాలలో ఒకటి. ఒక వేళ ఈ భాగం కనుక దెబ్బతింటే మన గోరు పూర్తిగా నాశనం అయిపోతుందట. కొందరిలో ఈ లునులా పెద్దగా ఉంటుంది. కొందరిలో చిన్నగా ఉంటుంది. కొందరిలో అసలు ఉండదు. కొందరిలో గోళ్లపై గీతలు, మచ్చలు కూడా ఉంటాయి. మన గోళ్లను చూసి మన ఆరోగ్య స్థితిని, మనకు రాబోయే వ్యాధులను కూడా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎవరి చేతి గోళ్ల మీద లునులా లేకపోతే వారు పౌష్టికాహార లోపం, థైరాయిడ్ గ్రంథి లోపాలతో, రక్త హీనతతో బాధపడుతున్నారని అర్థం. అంతే కాకుండా దీని వల్ల తరచూ ఆందోళనకు గురి అవ్వడం, బరువు పెరగడం, జుట్టు రాలడంవంటి సమస్యలతో కూడా బాధపడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎవరికైతే లునులా పెద్దగా ఉంటుందో వారు ఆరోగ్యంగా ఉంటారు. వారి జీర్ణశక్తి, థైరాయిడ్ గ్రంథులు బాగా పని చేస్తున్నాయని అర్థం.
ఒకవేళ ఈ లునులా నీలి రంగులో లేదా పూర్తిగా పాలిపోయినట్టు ఉంటే వారు త్వరలోనే డయాబెటిస్ తో బాధపడబోతున్నారని అర్థం. ఈ లునులా బాగా చిన్నగా ఉంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని, వారు అజీర్తితో బాధపడుతున్నారని, వారి శరీరంలో వ్యర్థాలు బాగా పేరుకుపోయాయని, రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని అర్థం.
అలాగ కొందరిలో గోర్లు పసుపు రంగులో ఉంటాయి. ఇలా గోర్లు పసుపు రంగులో ఉంటే వారిలో ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు, కాలేయ సంబంధిత సమస్యలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. ఎక్కువగా నెయిల్ పాలిష్ లను ఉపయోగించే వారిలో కూడా గోర్లు పసుపు రంగులో ఉంటాయి. ఇలా గోర్లు ఎక్కువ రోజులు కనుక పసుపు రంగులో ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.ఈ విధంగా మన గోర్లను బట్టి మన ఆరోగ్య స్థితిని అంచనా వేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.