దేశంలో అటు కరోనా..ఇటు ఒమిక్రాన్ కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 27,553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,249 మంది కోలుకున్నారు.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనాతో విలవిలాడుతున్న ప్రజలకు అది చాలదన్నట్లు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వారంలోపే కేసులు రెట్టింపవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మొత్తం కేసులు: 3,48,89,132
మొత్తం మరణాలు: 4,81,770
యాక్టివ్ కేసులు: 1,22,801
కోలుకున్నవారు: 3,42,84,561
ఒమిక్రాన్ విస్తరణపై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. తెలంగాణలో ఈనెల 10 వరకు ఆంక్షలు కొనసాగతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 25,75,225 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,45,44,13,005 కు చేరింది.