నేడు కరోనా వ్యాధి పేరు చెప్పి కార్పొరేట్ ఆసుపత్రులు, చిన్నా చితక ప్రయివేటు ఆసుపత్రులు ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాయి. కరోనా వచ్చిన వారి నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనాతో ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఆ కుటుంబం గుల్ల కావాల్సిన దుస్థితి దాపురించింది. కానీ ఒక పేదల డాక్టర్ పది రూపాయల ఫీజుతో కరోనాకు వైద్యం చేస్తున్నారు. ఆయన నెలకొల్పిన ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులకు తిప్పి తిప్పి కొడితే మొదటి నుంచి చివరి వరకు అయ్యే ఫీజు 15వేల రూపాయల నుంచి 20వేల వరకే. ఇంతకూ ఈ పేదల డాక్టర్ గురించి తెలుసుకోవాలని ఉంది కదా? అయితే చదవండి.
హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్, పిర్జాదిగూడ పరిసరాల్లో డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్ అనే వైద్యుడు ప్రజ్వల క్లినిక్ నెలకొల్పారు. ఆయన జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ తో ఎంబిబిఎస్ చదివారు. తర్వాత వివిధ ఆసుపత్రుల్లో పనిచేశారు. కొంత కాలం కిందట ఈ ప్రజ్వల క్లినిక్ ఆరంభించారు. ప్రస్తుతం ఆయన తన ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు కేవలం 10 రూపాయల ఫీజు తీసుకుని వైద్యం అందిస్తున్నారు. ఆయన ఆసుపత్రికి వచ్చే కోవిడ్ పేషెంట్స్ నిరుపేదలైతే ఉచితంగానే వైద్యం చేస్తున్నారు. అంతేకాదు అవసరమైన మందులు, టెస్టులకు సైతం నామమాత్రపు ఫీజులే తీసుకుంటున్నారు.
క్లీనిక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్ రోగులకు కన్సల్టెన్సీ ఫీజు కింద కేవలం 200 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాడు. పేదలకు రూ.10 మాత్రమే. ఇక ఆర్మీలో పనిచేసే సైనికులకు, రైతులకు, అనాథలు, దివ్యాంగులకు జబ్బు నయమయ్యే వరకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు.
15వేలకే కోవిడ్ టోటల్ ట్రీట్ మెంట్
కోవిడ్ చికిత్సలో భాగంగా ఆక్సిజన్ ఏర్పాటు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు బయటి రేట్లతో పోలిస్తే చాలా తక్కువ ధరకే అందజేస్తున్నారు డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్. అంతేకాదు ఎవరైనా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి ఇంటి వద్దే వైద్యం చేయించుకునే వారికోసం తన ఆసుపత్రి నుంచి నర్సులను పంపుతున్నారు. దీనికోసం ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు రోగులే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఆయన ఆసుపత్రిలో చేరి కరోనా వైద్యం చేయించుకుని హ్యాప్పీగా బయటకువెళ్లిన రోగులకు అయిన మొత్తం ఖర్చు చూస్తే 15 వేల నుంచి 20వేల లోపే ఉంటుందని పలువురు రోగులు చెబుతున్నారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరేందుకు రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక తన వద్దకు వచ్చే రోగుల్లో నిరుపేదలు ఉంటే ఫీర్జాదిగూడ ఐసోలేషన్ సెంటర్ లో చేర్పించి వారికి ఉచిత వైద్యం అందిస్తున్నారు. కరోనా సోకిన పేదవారి బతుకులు కాపాడేందుకే తాను ఈరకమైన వైద్యం అందిస్తున్నానని, ఇది తనకెంతో సంతృస్తిని ఇస్తుందని ఆయన గర్వంగా చెప్పుకుంటారు.