తెలంగాణలో మళ్లీ కరోనా టెన్షన్ నెలకొంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గగా మహమ్మారి పీడ విరగడైందని భావించారు. కానీ ఈ మహమ్మారి ఇప్పుడు చాపకింది నీరులా విస్తరిస్తుంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఇప్పుడు ప్రజలను కలవరపెడుతుంది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 26,704 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 403 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాదాపు మూడున్నర నెలల తర్వాత ఒక్కరోజులో 400కి పైగా కొత్త కేసులు నమోదుకావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో 185 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్టు వెల్లడించారు.
దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతిసారి మాస్కులు ధరిస్తూ..భౌతికదూరం పాటించాలి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కులు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి ఫ్లూ, ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడుని సంప్రదించాలి.