కరోనానా – సాధారణ జ్వరమా..ఈజీగా గుర్తించండిలా..

0
99

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అయితే  ఈమధ్య వాతావరణ మార్పులతో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరి ఇది కరోనానా.. సాధారణ జ్వరమా అని అయోమయం ఇప్పుడు అందరి మదిలో మెదిలో ప్రశ్న. మరి కరోనా, ఒమిక్రాన్​, సాధారణ జ్వరాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం…

గత కొద్దిరోజుల నుంచి వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారింది. సాయంత్రం, ఉదయం వేళల్లో చల్లటి గాలులు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామందిని రకరకాల శారీరక రుగ్మతలు వేధిస్తున్నాయి. చర్మం పొడి బారుతోంది. అస్తమా, సీవోపీడీ ఇతర శ్వాసకోశ ఇబ్బందులున్నవారు ప్రభావితమవుతున్నారు. కొందరిలో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో..ఈ అనారోగ్య సమస్యల కారణంపై అయోమయం నెలకొంటోంది.

కరోనా..సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో హైగ్రేడ్‌ ఫీవర్‌తో పాటు.. ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి. పడుకొని లేవాలంటే బాగా నీరసంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గుతో ఆగిపోతే సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌గా భావించవచ్చని, అయితే ఇది పూర్తిగా వాస్తవమని చెప్పలేమన్నారు. కేవలం దగ్గు, గొంతు నొప్పితో టెస్టు చేయించుకున్న కొందరిలోనూ కరోనా నిర్థారణ అవుతోందన్నారు.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించామన్నారు. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉన్న వారిని పరీక్షిస్తే… ప్రతి పది మందిలో 8-9 మందిలో కరోనా ఉందని, అదే జ్వరం లేకుండా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్న వారికి కరోనా పరీక్షలు చేస్తే 10 మందిలో ఒకరిద్దరిలోనే వైరస్‌ బయట పడిందని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన వైద్యులు తెలిపారు. డెల్టా వేరియంట్‌లో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోవడం, రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఒమిక్రాన్‌లో ఈ లక్షణాలు ఉండటం లేదని, అందుకే సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, కరోనా మధ్య గుర్తింపులో కొంత గందరగోళం ఉంటోందన్నారు.

సాధారణ వైరల్‌, కరోనా లక్షణాలు ఒకేలా ఉంటాయి. గుర్తించడం కొంత కష్టమే. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగితే అప్రమత్తం కావాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి. జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటివి ఉంటే ఆందోళన అవసరం లేదు. మాస్క్‌ ధరించి…వైద్యుల సూచనల మేరకు ఆయా లక్షణాలకు సంబంధించిన మందులు తీసుకుంటే సరిపోతుంది.