షాకింగ్ న్యూస్ : కరోనా వచ్చిపోయాక వేధిస్తున్న 203 రోగాలు

0
114

కరోనా వచ్చింది… పోయింది అని హాయిగా ఉందామనుకుంటే కుదరదు అంటున్నాయి పరిస్థితులు. కోవిడ్ వచ్చిపోయిన తర్వాత బాధితుల్లో 203 రకాల రుగ్మతలు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోవిడ్ సోకిన వారిలో 10 అవయవ వ్యవస్థల్లో రోగాలు రావొచ్చని చెబుతున్నారు. కొందరు కోవిడ్ రోగుల్లో అయితే వ్యాధి తగ్గిన 7 నెలల తర్వాత కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించారు. కరోనా ఇన్ఫెక్షన్ తగ్గిపోయినప్పటికీ లాంగ్ రన్ లో సమస్యలు వెంటాడుతున్నట్లు వెల్లడించారు. పది వ్యవస్థల్లో 203 రకాల రోగాలు వస్తున్నట్లు బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలేజ్ లండన్ పరిశోధకులు తెలిపారు.

కోవిడ్ వచ్చిపోయిన తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్న వారి వ్యాధి లక్షణాలను వర్గీకరించడానికి శాస్త్రవేత్తలు ఒక వెబ్ బేస్డ్ సర్వేను రూపొందించారు. కోవిడ్ లక్షణాలు మొదలైన 28 రోజుల తర్వాత కూడా కొనసాగిన అనారోగ్యానికి సంబంధించి 257 ప్రశ్నలను ఇందులో అడిగారు. 56 దేశాలకు చెందిన 3762 మంది ద్వారా జవాబులు రాబట్టారు. వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా 10 వ్యవస్థల్లో 203 రోగ లక్షణాలను గుర్తించారు.  వీటిలో 66 రోగ లక్షణాలు 7 నెలల వరకు కొనసాగినట్లు తేలతెల్లమైంది.

ఇందులో ప్రధానమైనవాటిలో అలసట, కొద్దిపాటి శ్రమకే తీవ్రంగా అలసిపోవడం, మానసిక సమస్యలు వెల్లడయ్యాయి. అంతేకాకుండా చూపుకు సంబంధించి చిత్ర భ్రమలు, ఒంటిపై దురదలు, మహిళల పీరియడ్స్ లో మార్పులు, లైంగిక సమస్యలు, గుండెలో దడ, మూత్రాశయ నియంత్రణ సమస్యలు, మెమరీ పవర్ తగ్గిపోవడం, చూపు మందగించి మసరకబారడం, డయేరియా వంటి లక్షణాలు గుర్తించారు.

మొత్తానికి కోవిడ్ వచ్చిపోవమే కాదు.. తగ్గిన తర్వాత కూడా నెలల తరబడి బాధితులను వేధిస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నదన్నమాట.