కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా దేశ రాజధాని ఢిల్లీ మారిపోయింది. 2021కి సంబంధించి ‘ఐక్యూ ఎయిర్’ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ‘ప్రపంచ వాయు కాలుష్య నివేదిక’ రూపొందించింది. ఈ నివేదికలో 117 దేశాల్లోని 6,475 నగరాల్లో ఉన్న వాయుకాలుష్య పరిశీలన కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ‘ఐక్యూ ఎయిర్’ కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో అత్యంత వాయు కాలుష్యం కలిగిన దేశ రాజధానుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.
అత్యంత వాయు కాలుష్యం కలిగిన 50 నగరాల్లో 35 భారత్‌లోనే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఢాకా (బంగ్లాదేశ్), ఉంజమెనా (చాద్), దుషాన్బే (తజకిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయని నివేదిక పేర్కొంది. ఢిల్లీ ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం. న్యూఢిల్లీలో పీఎం 2.5 సాంద్రతలు 2021లో 14.6 శాతం పెరిగాయి.
2020లో క్యూబిక్ మీటరుకు 84 మైక్రోగ్రాముల నుంచి 96.4 మైక్రోగ్రాములకు పీఎం స్థాయి పెరిగిందని నివేదిక పేర్కొంది. దాదాపు 48 శాతం నగరాల్లో సగటు వాయు కాలుష్యంకంటే ఎక్కువగానే ఉంది. నగరాల్లో నివసిస్తున్నప్రజలు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని, వాహనాల నుంచి వెలువడే విష వాయువులే ప్రధానంగా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని ఈ నివేదిక తెలిపింది.