ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’. అనారోగ్యం ధరిచేరితే ఇక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ..ఉన్న ఆస్తుపాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం వానాకాలం సీజన్. ఈ కాలమే వ్యాధుల మయం. ఈగలు, దోమలు ఈ రోగాలకు ప్రధాన కారణం. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు వానాకాలంలో అధికంగా వస్తాయి. మరి వీటి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..
టైఫాయిడ్, మలేరియా జ్వరాలు వస్తే వెంటనే విపరీతమైన జ్వరంతో ఆ లక్షణాలు తెలుస్తాయి. కానీ డెంగీ జ్వరం వచ్చాక కనీసం 3 నుంచి 5 రోజులకు గానీ ఆ లక్షణాలు కొందరిలో బయట పడవు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగీ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు కనబడుతాయి. డెంగీ వైరస్ కలిగి ఉన్న దోమలు మనల్ని కుట్టడం ద్వారా డెంగీ జ్వరం వస్తుంది.
డెంగీ వచ్చిన వారు తగ్గాక కూడా కనీసం 7 రోజుల పాటు నాన్‌వెజ్ తినకపోవడమే మంచిది. అలాగే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే మంచిది.
డెంగీ జ్వరం ఉన్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం ద్వారా రక్తంలో ప్లేట్‌లెట్లు పెరిగి త్వరగా కోలుకుంటారు. అలాగే కివీలు, దానిమ్మ పండ్లను తీసుకున్నా శరీర రోగ నిరోధక శక్తి పెరిగి పేషెంట్లు త్వరగా కోలుకుంటారు.
డెంగీ ఉన్న వారు మళ్లీ దోమలు కుట్టకుండా దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. మస్కిటో రీపెల్లెంట్లు, దోమ తెరలను వాడాలి. అలాగే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డెంగీ దోమలు ఎక్కువగా పగటి పూట కుడతాయని చెబుతారు. అయినప్పటికీ రాత్రి పూట కూడా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి.
సాధారణంగా కుటుంబంలో ఒకరికి డెంగీ వస్తే మిగిలిన అందరికీ ఆ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే అది అంటు వ్యాధి కాదు. కానీ ఒకరిని కుట్టిన డెంగీ దోమలు ఇంట్లో ఉన్న మిగిలిన వారినీ విడిచిపెట్టవు కదా. అందుకని ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అసలు ఏ దోమా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.