చెమటకాయలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే చెక్ పెట్టండిలా..

0
125

ఎండాకాలం రానే వచ్చింది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. అయితే ప్రజలను వేసవికాలంలో వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు ఒకటి. చర్మంపై చిన్న చిన్న మొటిమలు వస్తుంటాయి వాటినే చెమటకాయలు అంటారు. మరి చెమటకాయలు రాకుండా ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మరసం

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల చెమటకాయలు తగ్గిపోవడమే కాదు.. శరీరానికి కూడా చలువ చేస్తుంది. రోజుకు నాలుగు గ్లాసుల నిమ్మరసం తాగితే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. సమ్మర్ లో లెమన్ వాటర్ తాగడం బాడీ డీహెడ్రేట్ గా ఉంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఐస్ క్యూబ్స్:

సాధారణంగా శరీరం నుంచి స్వేద గ్రంథుల ద్వారా చెమట బయటికి వస్తుంది. కానీ ఎక్కడైనా ఈ గ్రంథులు మూసుకుపోతే చెమట బయటికి రాలేక శరీరంపై ఎర్రగా ఉండే చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడతాయి. ఇంట్లో ఉండే పదార్థాలతో చెమటకాయల్ని వదిలించుకోవచ్చు. చల్లటి ఐస్‌ముక్కలు శరీరానికి ఉపశమనాన్నిస్తాయి. చిన్నచిన్న ఐస్‌ముక్కల్ని ఎర్రగా ఉన్న చెమటకాయలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోయి తద్వారా చెమటకాయలూ కూడా తగ్గుతాయి.

వేపాకు

కొన్ని వేపాకుల్ని తీసుకుని నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్‌లా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ని చెమటకాయలున్న చోట పూసి.. పూర్తిగా ఆరనివ్వండి.. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంపై ఉండే క్రిములు నాశనమై తక్షణ ఉపశమనం లభించడంతో పాటు ఏవైనా ఇతర చర్మవ్యాధులున్నా కూడా పోతాయి.

చందనం

చందనం పొడి, కొత్తిమీర పొడి.. ఈ రెండింటినీ ఒక్కోటి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తీసుకుని.. మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్ వేసి మృదువైన పేస్ట్ వచ్చే వరకు బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని చెమటకాయలున్న చోట పూయండి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి.