అన్ని కాలాల్లోనూ లభించే కూరగాయల్లో దొండకాయలు ఒకటి. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ దొండకాయలను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దొండకాయల్లో శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో కూడా దొండకాయలను ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించే గుణం దొండకాయల్లో పుష్కలంగా ఉంటుంది. దొండకాయల్లో విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, సి వంటి వాటితోపాటు పీచు పదార్థాలు, బీటా కెరోటీన్, కాల్షియం, మెగ్నిషియం వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి.
దొండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దగ్గు, ఆకలి లేమి వంటి వాటితో బాధపడే వారు దొండకాయలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలను దృఢంగా ఉంచడంలో, మూత్ర పిండాల్లో రాళ్లను తొలగించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దొండకాయలు మనకు సహాయపడతాయి.