సాధారణంగా మాంసాహారం అంటే అందరికి ఇష్టమే. కొంతమందికైతే ముక్క లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్, చేపలతో కూడిన వెరైటీలు ఉండాల్సిందే. లేకుంటే ఆరోజు ఇంట్లో తినాలంటేనే కష్టంగా అనిపిస్తుంటుంది. చికెన్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. బరువు పెరగడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో కూడా చికెన్ దోహదపడుతుంది. కానీ చికెన్ తినడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ ను అధికంగా తీసుకోవడం వల్ల మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. రుచిగా ఉంది కదా అని దీనిని ఎక్కువగా తినడం వల్ల మన ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ ను ఎప్పుడూ కూడా తాజాగా ఉన్నప్పుడు మాత్రమే వండుకుని తినాలి. ఎక్కువ కాలం ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని తినకూడదు. చికెన్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల ఆ చికెన్ పై బాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. ఇలా బాక్టీరియా చేరిన చికెన్ ను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే చికెన్ జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కనుక చికెన్ ను తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా చికెన్ ను తినడం వల్ల అజీర్తి సమస్యతోపాటు శరీరంలో వేడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కనుక చికెన్ ను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని.. దానిని తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.