ఓసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని సిగగెట్, మద్యంతో మొదలుపెట్టి నెమ్మదిగా డ్రగ్స్ వైపు వెళ్తోంది నేటి యువత. ఒక్కసారి టేస్ట్ చూశాక..అదిచ్చే కిక్కు అలవాటు పడి ఎంతో మంది యువకులు ఆ మత్తు మాయలో జీవితాలు చిత్తు చేసుకుంటున్నారు. అది సీరియస్ అయ్యే వరకు వారి తల్లిదండ్రులకు తెలియడం లేదు. తమ పిల్లలకు డ్రగ్స్ ఎలా అలవాటయ్యాయో తెలియక కన్నవాళ్లు తలలు పట్టుకుంటున్నారు. పిల్లలు మత్తుకు బానిసవుతున్నారో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి.
విద్యార్థుల బ్యాగ్‌ల్లో లైటర్, ఐడ్రాప్స్, ఒ.సి.బి.పేపర్ లాంటివి గమనిస్తే అనుమానించాలి. స్నేహితులతో టెర్రస్‌పై ఎక్కువ సమయం గడుపుతుంటే ఏంచేస్తున్నారో కనిపెట్టాలి. ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లో ఉంటే ఆకస్మికంగా సందర్శించి పరిస్థితుల్ని గమనించాలి.
తరచూ కళాశాల యాజమాన్యంతో విద్యార్థి ప్రవర్తనపై ఆరా తీయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు. మాదకద్రవ్యాలు వినియోగించడం నేరమని చెప్పాలి. ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష లేదా రూ.20 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంటుందని అవగాహన కల్పించాలి. సరఫరా చేస్తూ దొరికితే 10-20 ఏళ్ల శిక్ష పడుతుందని స్పష్టం చేయాలి.