చాలా మందికి ఇష్టమైన పండ్లలో అరటి పండు(Banana) తప్పకుండా ఉంటుంది. చిన్నారుల నుంచి ముదుసలి వ్యక్తుల వరకు అందరూ కూడా అరటి పండును కష్టం లేకుండా తినేస్తారు. దానికి తోడు అరటి పండు రుచి కమ్మగా ఉండటంతో చాలా మంది దీనిని తినడానికి ఇష్టత కనబరుస్తారు. అంతేకాకుండా చాలా మంది ఆహారంలో కూడా ఈ అరటి పండు భాగంగా ఉంటుంది. దాంతో పాటుగా అరటి పండును రకరకాల ఇతర ఆహార పదార్థాలతో కలుపుకుని కూడా తినే అలవాటు చాలా మందికి ఉంది.
జ్యూస్, స్మూతీలు, స్వీట్స్, మిల్క్ షేక్స్ వంటి వాటి తయారీలో కూడా అరటి పండును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అరటి పండుల అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. దాంతో చాలా మంది హెల్తీ ఫ్రీక్స్ కూడా అరటి పండు తినడానికి ఇష్టపడతారు. బరువు పెరగాలని భావించే వారికయితే అరటి పండు ఫస్ట్ చాయిస్‌గా ఉంటుంది. కానీ అరటి పండును ఎలా పడితే అలా తింటే సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. అందలోనూ అరటి పండును దేనితో పడితే దానితో కలుపుకుని తినడం చాలా సమస్యలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అరటి పండు(Banana)లో ఉండో కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్, పొటాషియం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పోషకాల వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరం రక్షణ పొందుతుంది. అరటి పండులో అధిక శాతంలో ఉండే చక్కెర స్థాయిల వల్ల.. వీటిని తిన్న వెంటనే శక్తి అంది చురుకుగా పనిచేస్తారు. అరటి పండును తినడం వల్ల మన జీర్ణ శక్తి బలోపేతం అవుతుంది. బరువును పెంచడమే కాకుండా తగ్గించడంలో కూడా అరటి పండు కీలకంగా పనిచేస్తుంది. బలమైన ఎముకలకు అరటి పండు దివ్యఔషధంలా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా అరటి పండు చాలా కీలకం. మరి ఇంత మేలు చేసే అరటి పండును వేటితో కలుపుకుని తీసుకోకూడదో చూసేద్దామా..
బంగాళదుంప: అరటి పండు, దుంపను కలిపి తీసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవని నిపుణులు వివరిస్తున్నారు. రెండిటిలో పిండి పదార్థాలు అధికంగా ఉండటం వల్ల అది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ రెండిటిని కలిపి తినకూడదని నిపుణులు చెప్తున్నారు.
స్వీట్లు: హల్వా, బర్ఫీ వంటి స్వీట్లతో కలిపి కూడా అరటి పండ్లను తినకూడదట. అరటి పండ్లలో అధికశాతం చక్కెర ఉంటుంది. దానితో స్వీట్లు తినడం వల్ల శరీరం చక్కెర స్థాయిలు అధికమవుతాయి. వీటిని కలిపి తినడం వల్ల కూడా కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మధుమేహంతో బాధపడే వారికి ఈ కాంబినేషన్ చాలా డేంజర్ అని చెప్తున్నారు వైద్యులు.
ముల్లంగి: అరటి పండు(Banana)ను ముల్లంగితో కలుపుకుని కూడా తినకూడదని వైద్యులు చెప్తున్నారు. ముల్లంగి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలను పెంచుతుంది. అదే విధంగా అరటి పండు శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రెంటినీ కలిపి తీసుకోవడం వల్ల ఈ రెండు వ్యతిరేక స్వభావాలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దాంతో పాటుగా ఉబ్బరం, గ్యాస్, వాంతులు అయ్యే ప్రమాదం ఉందని, దాని వల్లే ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దోసకాయ: దోసకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. అరటి పండ్లలో చక్కెర, కార్బోహైడ్రేట్ల మిశ్రమం అధికంగా ఉంటుంది. ఈ రెంటిని కలిపి తినడం వల్ల వీటిలో ఉండేవి మన కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కాంబోను తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
వీటితో పాటుగా వేయించిన ఆహారాలతో కలిపి కూడా అరటి పండ్లను కలిపి తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ఈ కాంబినేషన్ జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపి కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు, వికారం వంటి అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండాలి. అంతేకాకుండా వేయించిన ఆహారాలతో కలుపుకుని తినడం వల్ల అరటి పండ్లలోని పోషకాలేవీ కూడా శరీరానికి అందవని వివరించారు వైద్యులు.