ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి చాలదా అంటూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా కలకలం రేపింది. కరోనా నుండి కాపాడుకోడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వాక్సిన్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వాక్సిన్ ఊపందుకుంది.
తాజాగా అమెరికాలో లక్షకు పైగా మరణాలు నమోదైన నేపథ్యంలో అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ పై పోరాడటానికి పౌరులకు నాలుగో డోసూ వేయాల్సి రావొచ్చన్నారు. ప్రజల వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా ఈ డోసు వేయాల్సి ఉంటుందని తెలిపారు.
నాలుగో డోసు అవసరంపై మీడియా అడిగిన ప్రశ్నలపై ఫౌచీ సమాధానం ఇస్తూ… ఈ అంశాన్ని దగ్గరి నుంచి గమనిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఇంకోసారి మరో బూస్టర్ అవసరం ఉండొచ్చని చెప్పారు. ఒమిక్రాన్‌ను ‘ఆందోళనకర వేరియంట్’గా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించినప్పటి నుంచి అమెరికాలో సుమారు లక్ష మరణాలు సంభవించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాలుగో డోసుపై ఫౌచీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.