హెచ్‌ఐవీ సోకినట్టు తెలిస్తే చాలు మనసులో అలజడి, సమాజంలో ఛీత్కారాలు. బతుకుపై ఆశతో బాధితులు వైరస్‌తో సహజీవనం చేస్తూనే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యాంటీ-రిట్రోవైరల్ డ్రగ్స్ వాడుతుంటారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఎలాంటి ఔషధాలను వాడకుండానే..హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందాడు
ఈ తరహా కేసుల్లో ఇది రెండోది కావడం విశేషం. వీరిద్దరిలో వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థలు ఎలా పని చేశాయన్న రహస్యాన్ని తెలుసుకోగలిగితే..హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇంతకుముందు ఓ హెచ్‌ఐవీ బాధితురాలు ఈ విధానంలో స్వస్థత పొందినట్టు గుర్తించిన శాన్‌ఫ్రాన్సిస్కో పరిశోధకులు..మరో వ్యక్తి కూడా స్టెరిలైజింగ్ క్యూర్ అయినట్టు తాజాగా ప్రకటించారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన 119 కోట్ల రక్త కణాలను, 50 కోట్ల కణజాల కణాలను పరీక్షించినా.. ఎక్కడా హెచ్‌ఐవీ జీనోమ్ జాడ కనిపించలేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఎలైట్ కంట్రోలర్స్‌లో స్టెరిలైజింగ్ క్యూర్ ఎలా జరుగుతోందన్నది లోతుగా తెలుసుకోగలిగితే.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు పరిష్కారం లభించినట్టే. వారిలో అత్యంత సహజంగా జరుగుతున్న ఈ పద్ధతిని అనుకరించి, మిగతా వారిని కూడా స్వస్థపరచవచ్చు. యాంటీ-రిట్రోవైరల్ థెరపీతో సంబంధం లేకుండా, వ్యాక్సినేషన్‌తోనే దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణురాలు జూ యూ తెలిపారు.