కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజుకో కొత్త వేరియంట్ టెన్షన్ పెడుతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో కొత్త వేరియంట్ కనుగొంటారో అన్న భయం చాలా మందిలో ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏదో ఒక వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసినవే.
మరి ఇవి అన్నీ వేరియంట్లపై ఒకేలా పని చేస్తాయా అనే అనుమానం కూడా చాలా మందికి ఉంటుంది.
ఇక ఈ వైరస్ లకు చెక్ పెట్టాలంటే కచ్చితంగా బలమైన వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టాలి అని ప్రజలు కోరుతున్నారు. అయితే భవిష్యత్ మహమ్మారులను దృష్టిలో పెట్టుకుని అమెరికా శాస్త్రవేత్తలు యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేశారు. తాజాగా జర్నల్స్ ప్రకారం ఈ టీకా కరోనాపైనే కాకుండా పలు వైరస్ లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రయోగాల్లో తేలింది.
అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. జంతువుల నుంచి మనుషులకి చాలా రకాల వైరస్ లు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ వాటిని నిరోధిస్తుంది అని తెలిపారు.
ముందుగా ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ బాగా పనిచేస్తోంది అని తేలింది. చూడాలి మరిన్ని పరిశోధనల తర్వాత ఇది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉండవచ్చు అంటున్నారు నిపుణులు