మన వంటిల్లు వైద్యశాల అని భారతదేశంలో అందరూ నమ్ముతారు. మనకు తరచుగా వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వంటింటిలోనే ఔషధాలు లభిస్తుంటాయి. మనం మన కూరల్లో ప్రతి ఒక్క వస్తువు కూడా మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. ఉప్పు, పసుపు, వాము, జీలకర్ర.. ఇలా మన వంటింట్లో ఉండి ప్రతి దినుసు కూడా సరైన క్రమంలో వినియోగిస్తే ఔషధమే. వాటిలో సోంపు(Fennel Seeds) కూడా ఒకటి. సాధారణంగా సోంపును అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చిట్కా వైద్యంలా వినియోగిస్తుంటారు.
జీలకర్ర తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరూ చెప్తారు. కానీ సోంపు వల్ల ఏంటి ప్రయోజనాలు అంటే మాత్రం అందరూ పట్టిక్యూలర్‌గా చెప్పడం కాస్తంత కష్టమే. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం సోంపు తినడం వల్లే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు. ఇది మన ఆహారం రుచిని పెంచడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా రెట్టింపు చేస్తుందని వివరిస్తున్నారు.
నోటిని శుభ్రపరచడానికి, నోటి దుర్మాసనను దూరం చేయడానికి కూడా సోంపు ఉపయోగపడుతుందని వైద్యులు అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలను మెరుగుపరచడంలో సోంపు ప్రయోజనకరంగా ఉంటుంది. మరి సోంపుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒక లుక్కేద్దామా..
ఒత్తిడి: సోంపు(Fennel Seeds) తినడం ద్వారా ఒత్తిడి సమస్య దూరమవుతుంది. సోంపులో ఉండే కొన్ని పోషకాలు మన ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి సోంపు ఒక దివ్యౌషధం. నాణ్యమైన నిద్రకు దోహపదపడుతుంది సోంపు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక చెంచా సోంపును మెత్తగా నమిలి తినడం ద్వారా ప్రశాంతమైన నిద్ర పోవచ్చని వైద్యులు చెప్తున్నారు.
నోటి సంరక్షణ: సోంపు తినడం వల్ల మన నోటి సంరక్షణ సులువవుతుందని వైద్యులు అంటున్నారు. నోటి దుర్వాసనను దూరం చేసి, దంతాలను దృఢంగా మార్చడంలో సోంపు కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటుగా దంతక్షయాన్ని నివారించడంలో కూడా సోంపు అద్భుతంగా పని చేస్తుంది.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. నోటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి సోంపు తినడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కంటి చూపు: సోంపు మన కంటి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సోంపు చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటుగా కంటిశుక్లం వంటి సమస్యలను నివారించడంలో కూడా సోంపు సూపర్‌గా పనిచేస్తుంది. కంటి సమస్యలు ఉన్న వారు సోంపును తరచుగా తినడం చాలా మంచిదని చెప్తున్నారు వైద్య నిపుణులు.
మధుమేహం: డయాబెటీస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి సోంపు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సోంపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడే వారు సోంపును తరచూ తినడం మంచిది.
జీర్ణ వ్యవస్థ: మన జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో కూడా సోంపు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ ప్రక్రియను సాఫీగా చేయడంలో ఉపయోగపడుతుంది. ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది.
చర్మం: మన చర్మ ఆరోగ్యానికి సోంపులో ఉండే ఫెన్నెల్లో యాంటీఆక్సిడెంట్లు చాలా బాగా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని ర్యాడికల్స్ నుంచి రక్షిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. చర్మ సంబంధిత సమ్యలను తగ్గిస్తుంది. చర్మం మెరిసేలా కూడా చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
అయితే సోంపును అతిగా తింటే మాత్రం తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సోంపును అధిక మొత్తంలో తింటే కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతేకాకుండా సోంపును అతిగా తీసుకుంటే విరేచనాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కాగా గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే మహిళలు సోంపు తినే ముందు వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకే సోంపును తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
దాంతో పాటుగా సోంపును తినే పద్దతిని బట్టి కూడా దాని ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. సాధారణంగా అందరూ ఆహారం తిన్న తర్వాత ఒక అరచెంచా సోంపు నములుతుంటారు. ఇలా చేయడం ద్వారా ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అదే విధంగా సోంపును నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకుని తాగొచ్చు. ఇలా రోజూ ఉదయాన్నే చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందొచ్చు. సొంపును టీ తాగొచ్చు. సోంపును కూరల్లో కూడా వాడొచ్చు. కానీ మితంగా వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు.