దానిమ్మ పండు(Pomegranate).. ఇవి చాలా ఫేమస్. రక్తం పట్టాలన్నా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారికి వీటిని తినాలని సిఫార్సు చేస్తారు. అయితే చాలా మంది దానిమ్మ పండ్లు తినడం వల్ల రక్తం బాగా పడుతుందని మాత్రమే అనుకుంటారు. కానీ వీటిని తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ప్రతి రోజూ ఒక దానిమ్మ పండు తింటే అది మనల్ని ఎంతో ఆరోగ్యవంతంగా మారుస్తుందని, ఎన్నో ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నుంచి కాపాడుతుందని వైద్య నిపునులు చెప్తున్నారు.
సాధారణంగా ఏ పండుకైనా ఒక సీజన్ అన్నది ఉంటుంది. అలా లేని పండ్లు చాలా తక్కువ. వాటిలో దానిమ్మ కూడా ఒకటి. దీనిని ఏ సీజన్‌లో తిన్నా అద్భుత ప్రయోజనాలు అందిస్తుందని వైద్యులు అంటున్నారు. దానిమ్మ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రికవరీని పెంచుతాయి. దాంతో పాటుగా ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి.
ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు వారానికి మూడు దానిమ్మ పండ్లైనా తినాలని వైద్యులు అంటున్నారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసా..
అజీర్తికి స్వస్తి: దానిమ్మ పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం, అజీర్తి సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. దానిమ్మ పండ్లలో ఉండే అధిక ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దానివల్ల బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా రోజూ ఉదయాన్ని దానిమ్మ పండు తింటే.. ఇది ఇన్‌స్టంట్ ఎనర్జీని అందించి రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేలా చేస్తుంది. దీంతో పాటుగా దానిమ్మ వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది.
గుండె పదిలం: దానిమ్మ పండు(Pomegranate) మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫినాల్స్, ప్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడంట్ల వల్ల శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రేస్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును కూడా నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా గుండెపై అధికభారం పడకుండా కాపాడుతుంది. గుండె బలంగా పదిలంగా ఉండటానికి దోహదపడుతుంది. దానిమ్మను తరచుగా తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అనేక రకాల గుండె సంబంధిత సమస్యలు రాకుండా కూడా దానిమ్మ పండు కాపాడుతుంది.
రోగనిరోధక శక్తి: దానిమ్మ పండులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలోని తెల్లరక్తకణాల సంఖ్యను పెంచడంలో కూడా దానిమ్మ పండ్లు బాగా పనిచేస్తాయి. ఇందులో ఉండే అనేక పోషకాలు మన రోగనిరోధక శక్తిని అధికం చేస్తుంది. తద్వారా అనేక రకాల బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది.
మెరిసే చర్మ: దానిమ్మ పండ్లలో భారీ మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఎనర్జీని పెంచడంతో పాటు మన చర్మానికి కావాల్సిన పోషకాలను అందించడంలో కూడా దానిమ్మ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. చర్మం సాగే గుణాన్ని పునరుద్దరించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని అధికం చేస్తుంది. కాలం ఏదైనా దానికి అనుగుణంగా చర్మం ఉంటుంది. ప్రతి రోజూ దానిమ్మ పండు తినడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు.
మెదడు ఆరోగ్యం: దానిమ్మ పండ్లు మన మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా తరచుగా జరిగే కణాల డ్యామేజీని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. దానిమ్మ పండ్లలో ఉండే ఫాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన మెదడు ఆరోగ్యాన్ని అధికం చేస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాదులను తగ్గించే గుణాలు కూడా దానిమ్మ పండ్లలో అధకంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.