నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. మేలు చేస్తుంది కూడా. ఆరోగ్యం(Health)గా ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని వైద్యులు చెప్తారు. కానీ రోజుకు ఎనిమిది గంటల నిద్ర మన శరీరానికి సరిపోదని కూడా అంటున్నారు నిపుణులు. రోజూ మధ్యాహ్నం సమయంలో ఒక కునుకు(Power Nap) వేయడం వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయని చెప్తున్నారు. ఇలా మధ్యాహ్నం సమయంలో వేసే కునుకు మన శరీరాన్ని, మెదడును మరింత ఉత్తేజపరుస్తుందని, మన పనిపై ఏకాగ్రతను పెంచడంలో కూడా ఈ పవర్‌న్యాప్ ఎంతో దోహదపడుతుందనేది నిపుణులు చెప్తున్న మాట. రోజంతా తీరిక లేకుండా పనిలోనే ఉండే వారికి ఈ మధ్యాహ్నం సమయంలో తీసే చిన్నపాటి కునుకు పెద్ద మేలే చేస్తుందని చెప్తున్నారు వైద్యులు.
ఈ చిన్నపాటి సమయం పోయే నిద్రతో ఉత్తేజం, ఉత్సాహం పెరగడమే కాకుండా శారీరిక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. ఈ నిద్రతో కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందొచ్చట. ఇలా చేయడం వల్ల ఒకే రోజును రెండుసార్లు ఉత్సాహంగా ప్రారంభించొచ్చని అంటున్నారు నిపుణులు. చాలా మంది మధ్యాహ్నం వేసే ఈ కునుకు మనను బద్దంగా మారుస్తుందని, ఆ మత్తు వదలక రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని భావిస్తారని, కానీ అది నిజం కాదని అంటున్నారు. మధ్యాహ్నం సమయంలో కొంతసేపు పోయే నిద్ర చాలా మేలు చేస్తుందని పునరుద్ఘాటిస్తున్నారు వైద్యులు.
మధ్యాహ్నం సమయంలో కొద్దిసేపు నిద్రపోవడం వల్ల రక్తపోటును నియంత్రించొచ్చని వైద్యులు వివరిస్తున్నారు. బీపీతో బాధపడే వారికి కూడా మధ్యాహ్నం సమయంలో పోయే నిద్ర మేలు చేస్తుందని, మరెన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఈ నిద్ర మనల్ని కాపాడుతుందని నిపుణులు చెప్తున్న మాట.
పవర్ న్యాప్ అంటే గంటల తరబడి నిద్రపోవడం కాదు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు వేసే కునుకును వైద్యులు, ఆరోగ్య నిపుణులు పవర్ న్యాప్ అని పిలుస్తారు. ఒకవేళ ఈ సమయం పెరిగి 30 నిమిషాలు ఆ పైగా ఉంటే మాత్రం రాత్రి సమయంలో నిద్రకు ఆటంకాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో ఇలా అరగంటకన్నా ఎక్కువ సేపు నిద్రించడం వల్ల మిగిలిన రోజంతా కూడా మత్తుగా ఉండటంతో పాటు ఈ పవర్ న్యాప్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలన్నీ దూరమవుతాయని అంటున్నారు నిపుణులు. రాత్రి సమయం నిద్రకు ఆటంకాలు ఏర్పడ్డాయంటే.. లేనిపోని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకోవడమేనని అంటున్నారు.
పవర్ న్యాప్స్‌తో మెదడు రీఫ్రెష్ అవుతుంది. రోజును కొత్తగా ప్రారంభించిన ఫీల్ కలుగుతుంది. ఈ నిద్రతో శరీరంలో సెరటోనిన్ డోపమైన్ విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుంది. చేసే పనులనే మరింత సృజనాత్మకంగా చేయగలుగుతారు. దాంతో పాటుగా విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం, వినూత్న కోణంలో చూసే దృష్టి కూడా పెరుగుతుందట. జ్ఞాపకశక్తికి కూడా ఈ పవర్ న్యాప్ పవర్‌ఫుల్ బూస్ట్ ఇస్తుందని చెప్తున్నారు నిపుణులు.
ఈ పవర్ న్యాప్స్(Power Nap)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వేసే కునుకు సమయం విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండాలంటున్నారు. పవర్ న్యాప్ ఎప్పుడూ కూడా 10 నుంచి 30 నిమిషాల మధ్యే ఉండాలట. ఈ నిద్ర 30 నిమిషాలను దాటితే మాత్రం రాత్రి సమయంలో నిద్ర పోవడం సమస్యలు ఎదుర్కోవడం తప్పదని వివరిస్తున్నారు వైద్యులు. ఈ పవర్ న్యాప్స్‌ను కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య తీసుకుంటే ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉంటాయని, మెదడు ఆరోగ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని వివరిస్తున్నారు. ఇతరులతో పోలిస్తే మధ్యాహ్నం సమయంలో పవర్ న్యాప్స్ వేసే వారు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తారని వైద్యులు అంటున్నారు.