ఈ రోజుల్లో చాలా మంది ఆఫీసు వర్కులు ఎక్కువ చేస్తున్నారు. కంప్యూటర్ జాబులు కావడంతో అందరూ నాలుగు గోడల మధ్య ఉంటున్నారు. అస్సలు ఎండలో వేడి తగలకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. కాని మన శరీరానికి కాస్త ఎండ కచ్చితంగా తగలాలి. చాలా మంది సూర్య రశ్మికి దూరంగా జీవిస్తున్నారు. దీంతో ఎక్కువమంది డి విటమిన్ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కచ్చితంగా అన్నీ విటమిన్లు శరీరానికి అందాలి.సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి కూడా మనకు ఎంతో అవసరం. విటమిన్ డి3 చర్మానికి సూర్యరశ్మి సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఎండలో అస్సలు ఉండని వారికి ఈ లోపం అనేది ఉంటుంది.
విటమిన్ డి లేకపోతే శరీరం కాల్షియంను శోషించుకోదు. ఈ క్రమంలో ఎముకలు గుల్లగా మారి పెళుసుగా మారిపోతాయి. అందుకే కనీసం ఉదయం పూట కాసేపు ఎండలో ఉంటే మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది. గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుంది. గర్భిణీలు విటమిన్ డి ఉండే ఫుడ్ కూడా తీసుకోవాలి.