సాధారణంగా మహిళలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో రక్తస్రావం అవుతుందన్న విషయం తెలిసిందే. గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై, అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు సంసిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన రక్తసరఫరాను, పోషకాలను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి తోడ్పడుతుంది.
పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం మంచిది కాదని మహిళలు అభిప్రాయపడుతుంటారని, వాస్తవానికి పీరియడ్స్ నొప్పి అనేది శరీరంలోని అంతర్లీన సమస్యను సూచించదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పీరియడ్ సమయంలో తేలికపాటి నుంచి మితమైన నొప్పి మంచి సంకేతమని వారు తెలిపారు. పీరియడ్ నొప్పి ఆరోగ్యకరమైన గర్భాశయం, అండాశయాలకు సంకేతం అని వారు పేర్కొన్నారు. మహిళలు పీరియడ్స్ సమయంలో పులుపుగా ఉండే ఆహారంతో పాటు చల్లని ఆహారాలు తీసుకోకూడదని పలువురు అపోహ పడుతుంటారని, కానీ ఇందులో నిజం లేదన్నారు.
మరోవైపు మహిళలు పీరియడ్స్ సమయంలో గర్భం పొందలేరనే విషయం కేవలం అపోహేనని తేల్చి చెప్పారు. పీరియడ్స్ సమయంలోనూ మహిళలు గర్భం దాల్చే అవకాశం ఉంటుందన్నారు. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. గర్భం దాల్చడానికి మహిళల్లో అండోత్పత్తి జరగాల్సి ఉంటుందని, ఇది సాధారణంగా పీరియడ్స్ ముగిసిన తర్వాతే జరుగుతుందన్నారు. మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రాని పక్షంలో ఫలదీకరణతో ఉన్న సమయం పీరియడ్స్ కాలంలో అతిగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్ల సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం అయితే పీరియడ్స్ సమయంలో కూడా గర్భం పొందవచ్చన్నారు.