ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ టెర్రర్ పుట్టిస్తుంది. రానున్న రోజుల్లో ఈ వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్‌లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అయితే ఈ వ్యాధికి వ్యాక్సిన్ఉందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
గతంలో 1980కు ముందు మశూచి నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడ్డ మశూచి వ్యాక్సిన్ వలన ఏర్పడ్డ రోగనిరోధక శక్తి కొంతమేరకు అప్పట్లో మంకీ పాక్స్‌ను కూడా నివారించగల్గింది. 2019లో అమెరికన్ వైద్య నియంత్రణ సంస్థ అయిన యు.ఎస్.ఎఫ్.డి.ఏ వ్యాధుల నివారణకై ఆమోదించిన JYNNEOS (MVA-BN) అనే వ్యాక్సిన్ ప్రస్తుతం మంకీపాక్స్ నివారణలో విస్త్రతంగా సిఫారసు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది.
అయితే అంతర్జాతీయ ప్రయాణీకులలో వ్యాధి లక్షణాలను గుర్తించి ఐసోలేట్ చేసి చికిత్స అందించడం, శాంపిల్స్‌ను వైరాలజీ ల్యాబ్‌కు పంపి నిర్థారించడం, వ్యాప్తితీరు, వ్యాధి తీవ్రతలో మార్పుల గురించి అధ్యయనాలు నిర్వహించి, వ్యాధి నివారణ గురించి ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కలిగించడం చేయాలి.
అలాగే ఇతరులనుండి వ్యాధి సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు పాటించాలి. అనుమానిత లక్షణాలున్న పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువుల స్పర్శకు దూరంగా ఉండటం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలున్న వ్యక్తులకు దూరం పాటించడం, సభలు, జాతరలు, షాపింగ్ మాల్స్ వంటి హై రిస్క్ ప్రాంతాలలో మాస్క్ ధరించడం, రెగ్యులర్‌గా చేతుల పరిశుభ్రత పాటించడం, అనుమానిత లక్షణాలు కనబడ్డ వెంటనే తగిన వైద్యసలహా తీసుకోవడం, వ్యాధి లక్షణాలు తగ్గేదాకా ఐసోలేషన్ పాటించడం వంటివి పాటించాలి.